పారిశుద్ధ్యంపై ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్న మున్సిపల్, వైద్యారోగ్యశాఖ అధికారులు... పురపాలికల్లోని శివారు ప్రాంతాలను మాత్రం పట్టించుకోవడం లేదు. కొత్తగా ఏర్పడిన కాలనీల్లో మురుగు కాల్వల వ్యవస్థ లేక అస్తవ్యస్తంగా మారుతున్నాయి. ఇళ్లలోని మురుగు, వర్షంనీరు ఖాళీస్థలాల్లో చేరి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. అవే ఖాళీ స్థలాల్లో జనం వ్యర్థాలు పారవేయడంతో... మురికికూపాలుగా తయారవుతున్నాయి. పందులు ఇతర జంతువులు సంచరిస్తూ వ్యాధులను వ్యాపింపజేస్తున్నాయి.
కలెక్టర్‌కు విన్నవించుకున్నా..
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో కల్వకుర్తి రోడ్డు సరస్వతి కాలనీ, జోగులాంబ జిల్లా కేంద్రంలోని రాంనగర్, కుంటవీధి, నల్లకుంట, చింతల్‌పేట, సంతోష్‌నగర్, రెండో రైల్వే గేటు వెనక ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు అత్యంత దారుణంగా మారాయి. భూత్పూర్ మున్సిపాలిటీలోనూ మురుగు నీటి నిల్వలు రోగాలకు అడ్డాగా మారుతున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. కలెక్టర్ దాకా వెళ్లి మొర పెట్టుకున్నా ఫలితం లేదని ఆరోపిస్తున్నారు.