మహబూబ్నగర్లో ప్రధాన రహదారిని ఆనుకుని చిరువ్యాపారాలు చేస్తూ వందల కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. పండ్లు, పూలు, కొబ్బరిబోండాలు ఇలా అనేక వ్యాపారాలు రోడ్డు మీదే సాగుతున్నాయి. జాతీయ రహదారి కావడంతో పాటు రోడ్డు విస్తరించడం కారణంగా వ్యాపారం చేసుకునేందుకు వీలులేకుండా పోయింది. ఈ క్రమంలో చిరువ్యాపారులకు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వమే షెడ్లు నిర్మించి ఇస్తుందని అధికారులు చెప్పటంతో వారు సంబరపడ్డారు. కానీ, ఆ సంతోషం ఎంతోకాలం నిలువలేదు. అక్కడ నిర్మించిన షెడ్లలో ఏళ్ల తరబడి వ్యాపారం చేసుకుంటున్న వారికి చోటు దక్కలేదు. షెడ్లు తమకి కాకుండా కొత్తవారికి కేటాయించారని బాధితులు ఆరోపించారు.
విస్మయంలో బాధితులు..
జిల్లా కేంద్రంలో అటవీశాఖ కార్యాలయం ప్రహరీ పొడవున 57, నీటి పారుదలశాఖ ప్రహరీ పొడవున 12, జిల్లా ఆసుపత్రి ఎదురుగా 11, మెట్టుగడ్డ వద్ద 31 మొత్తం 111 దుకాణాలను 64 లక్షలతో నిర్మించారు. ఇందులో కొందరికీ ఇప్పటికే కేటాయించారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తికాక మరికొన్ని ఖాళీగా ఉన్నాయి. షెడ్లు నిర్మించడం కంటే ముందే ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న వారి జాబితాను సిద్ధం చేశామని మున్సిపల్ అధికారులు వెల్లడించారు. అయితే.. కేటాయింపుల్లో వారికి చోటు దక్కకపోవడంపై బాధితులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. షెడ్లు ఇవ్వకపోయినా పర్లేదు కానీ... వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు. మరోవైపు దుకాణాలను అర్హులైన లబ్దిదారులకే కేటాయించామని అధికారులు వెల్లడించారు. ఇంకెవరికైనా అవసరం ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.