Dengue fever in Gadwal: జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రజలు దోమల స్వైర విహారంతో రోగాలబారిన పడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జనావాసాల్లో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. మురుగునీటిలో దోమలు ఆవాసాలను ఏర్పాటు చేసుకొని విపరీతంగా పెరిగిపోతున్నాయి. జిల్లాలో దోమ కాటుతో గత రెండు నెలల నుంచి జ్వరాల బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోజుకు 700 నుంచి 900 వరకు జ్వర బాధితులు జిల్లా ఆస్పత్రికి వెళుతున్నారు. జిల్లాలోని గద్వాల, గట్టు, మల్దకల్, ధరూర్ ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. రోజురోజుకు పెరుగుతున్న జ్వరాలతో ఆస్పత్రులు అన్నీ కిటకిటలాడుతున్నాయి.
గద్వాలలోని ప్రధాన కూడలిలో ఉన్న మురుగు కాల్వల్లో నీరు నిలిచిపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి మురుగు కాల్వలను శుభ్రం చేయించాలని కోరుతున్నారు. ఎక్కువ మంది జ్వరాల బారిన పడుతున్నందున ఆరోగ్య సర్వే జరిపి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. చిన్నారులు డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలతో బాధ పడుతున్నారని స్థానికులు తెలిపారు.