భారత్ మాల పరియోజన కింద కర్ణాటక దేవసూగూరు నుంచి జడ్చర్ల వరకు 4వరుసల రహదారి నిర్మాణానికి ప్రతిపాదించారు. మహబూబ్ నగర్ జిల్లాలో 17గ్రామాల నుంచి 225 హెక్టార్ల భూమిని సేకరణకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకోసం 17గ్రామాల్లో గుర్తించిన సర్వే నెంబర్లను రెవెన్యూ అధికారులు నిషేధిత భూముల జాబితాలో చేర్చారు. ప్రస్తుతం భూసేకరణకు అక్కరలేని భూములు సైతం నిషేధిత జాబితాలో చేరిపోయాయి. అందులోని సర్వే నెంబర్లలో క్రయవిక్రయాలకు అవకాశం లేకుండా పోయింది. ఏ అవసరానికైనా అమ్ముకుందాముంటే వీలులేకుండా పోయింది. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందించడం లేదని బాధితులు వాపోతున్నారు. నిషేధిత జాబితా నుంచి వీలైనంత త్వరగా తొలగించాలని వేడుకుంటున్నారు.
భూమి ఉన్నా... హక్కుల్ని అనుభవించలేక అవస్థలు పడుతున్న రైతులు - భారత్ మాల పరియోజన తాజా వార్తలు
ప్రభుత్వ అవసరాల కోసం సేకరించిన భూమిని మాత్రమే కాకుండా ఆ సర్వే నెంబర్ మొత్తాన్ని నిషేధిత జాబితాలో చేర్చడం భూయజమానుల పాలిట శాపంగా మారుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలో భారత్ మాల కింద రోడ్డు నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణ సర్వే, నిర్వాసితులతో పాటు ఆ సర్వే నెంబర్‌లోని రైతులకు, భూసేకరణ నుంచి మినహాయించిన గ్రామాల రైతులకు కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టింది. భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో భూమి ఉన్నా, హక్కుల్ని అనుభవించలేక అవస్థలు పడుతున్నారు.
17 గ్రామాల నుంచి 225 హెక్టార్ల భూమిని సేకరించాలని తొలుత భావించారు. ఆ తర్వాత ప్రకటనలో అల్లీపూర్, పాలకొండ, అమిస్తాపూర్, తాటికొండ, ఎదిర, భూత్పూరు, తాడిపర్తి,ధర్మపూర్ గ్రామాలకు చెందిన సుమారు 110 హెక్టార్లను భూసేకరణ నుంచి తొలగించారు. ఈ భూముల్లో 400 నుంచి 500 మంది రైతులు ఉన్నారు. వీరంతా భూములున్నా వాటిపై హక్కుల్ని అనుభవించలేకపోతున్నారు. రెవెన్యూ అధికారులు మాత్రం భూయజమానులు మీ- సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారి అభ్యర్థనను పరిశీలిస్తామని, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని చెబుతున్నారు.
ఇవీ చదవండి: