కొవిడ్ రెండోదశ కారణంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిపై పనిభారం భారీగా పెరిగింది. మహబూబ్‌నగర్‌లోని 4 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోనూ పరీక్షలు, టీకాలు, కోవిడ్ ఓపీ, సాధారణ రోగులతో అక్కడి వైద్యులు, సిబ్బందిపైనా ఒత్తిడి పెరుగుతోంది. ఆ సమస్య పరిష్కరించే దిశగా జిల్లా వైద్యారోగ్యశాఖ తొలిసారిగా పట్టణంలో నాలుగు బస్తీ దవాఖానాలు ప్రారంభించింది. నిరుపేద కుటుంబాలు అధికంగా నివసించే ఎనుగొండ, టీడీ గుట్ట, వీరన్నపేట, ధోబీవాడల్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతమున్న యూహెచ్‌సీ లతోపాటు వీటిలో వైద్యసేవలు అందనున్నాయి. బస్తీ దవాఖానాలు కేవలం కొవిడ్ రోగులకు కాదని.... ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు.
కొవిడ్ రోగులకూ మందులందిస్తారు..
కరోనాకు భయపడి సాధారణ రోగులు కోవిడ్ ఓపీ సేవలున్న చోటకు వైద్యం కోసం వెళ్లట్లేదు. అలాంటి వారికి బస్తీదవాఖానాలు ఉపయోగపడనున్నాయి. ఇక్కడ సాధారణ పరీక్షలు, సాధారణ చికిత్సలుమాత్రమే అందిస్తారు. స్వల్పలక్షణాలు ఉన్న కొవిడ్ రోగులకూ మందులందిస్తారు. ప్రతిదవాఖానాలో ఓ వైద్యాధికారి, స్టాఫ్‌నర్స్,ఫార్మసిస్టు సహా ఆయా ప్రాంతాల పరిధిలోని ఎఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు సేవలు అందిస్తారు ఆసుపత్రులకు కావాల్సిన మందులు, సామాగ్రి పంపిణీ చేశారు. ప్రజలకు బస్తీ దవాఖానాలు ఎంతో ఉపయోగపడతాయని వైద్యాధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.