Heavy Rains: వరద ఒక్కో అడుగు వెనక్కి పోతుంటే.. మునిగిన ఇళ్లు.. కూలిన గోడలు.. మేటలతో పొలాలు తేలుతున్నాయి. ఊరొదిలి పోయిన బాధిత కుటుంబాలు కొన్ని స్వస్థలాలకు తిరిగి వస్తున్నాయి. మరికొన్నిచోట్ల గృహాలు మునిగి ఉండటంతో బాధితులు పునరావాస కేంద్రాల్లోనే తల దాచుకుంటున్నారు. ఇంకొందరు ఊళ్లోకి ఎప్పుడు వెళ్దామా అని రోడ్లపై నిరీక్షిస్తున్నారు. భద్రాద్రి జిల్లా మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఐదు రోజులుగా ప్రాణాలరచేత పట్టుకుని ఉన్న బాధితులు ఇప్పుడు ఆస్తి, పంట నష్టంపై అంచనా వేసుకుంటున్నారు. పొలాలు, చెలకల్లో వేసిన మేటలు చూసి గుండెలు బాదుకుంటున్నారు. గ్రామాల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. పంచాయతీరాజ్‌శాఖ బ్లీచింగ్ చల్లుతున్నా మురుగుతో దుర్వాసన వదలడం లేదు. పెనువిలయం సృష్టించిన వరద ప్రభావిత ప్రాంతాల్లో భీతావహ పరిస్థితులపై ప్రత్యేక కథనం..
మళ్లీ చినుకు పడుతుంటే జనం వణికిపోతున్నారు. వారు ఇప్పటికీ గ్రామాల్లోకి వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి. రోడ్లు బురదతో నిండి ఉండటంతో కాలు కదపలేని దుస్థితి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, అశ్వాపురం మండలాల్లో కొన్ని గ్రామాలు మాత్రం ముంపు నుంచి బయటపడ్డాయి. మణుగూరు పరిధిలోని చిన్నరాయగూడెం, కమలాపురం, అన్నారం ప్రజలు ఊళ్లలోకి చేరుకున్నారు. కొన్ని చోట్ల ఇళ్ల గోడలు కూలాయి. ఇళ్లలో బియ్యం సంచులు నానిపోయాయి. గృహోపకరణాలు పాడయ్యాయి. ఒక్కో కుటుంబానికి సాగు పరంగా రూ.లక్ష నష్టం వాటిల్లినట్లు బాధితులంటున్నారు. ఇళ్లు, గృహోపకరణాలు, వ్యవసాయ పరికరాలతో ప్రతి కుటుంబానికి రూ.3 లక్షల నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు.
చింతిర్యాలకు పడవపై ‘ఈనాడు’ బృందం..
అశ్వాపురం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో గోదావరి ఒడ్డున ఉన్న చింతిర్యాల గ్రామం భారీగా నష్టపోయింది. పెద్ద చింతిర్యాల నుంచి చింతిర్యాలకు మధ్య రహదారిలో ముంపు ఏర్పడటంతో నాటు పడవల్లోనే జనం వెళుతున్నారు. నాటుపడవలో ‘ఈనాడు’ బృందం అవతలి ఒడ్డుకు ప్రయాణించి.. బురదలో కాలినడకన ఈ గ్రామానికి చేరుకుంది. గ్రామంలో 56 ఇళ్లు మునిగాయి. అందులో కొన్ని ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. చాలావరకు గుడిసెల గోడలు కూలిపోయాయి. ఈ గ్రామం వారికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొండికుంటలో పునరావాసం కేంద్రం ఏర్పాటు చేయడంతో బాధితులు అవస్థ పడుతున్నారు. ఈ ప్రాంతంలో 600 ఎకరాల్లో భారీగా ఇసుక, ఒండ్రు మేటలు వేసింది. ఎకరాకు రూ.15 వేల వరకు ఖర్చు చేసి సాగుచేసిన పత్తి పూర్తిగా కనుమరుగైంది. గ్రామానికి చెందిన వెంకటరమణ, వంశీ, రవితో పాటు మరికొందరు నాటు పడవలను ఏర్పాటు చేసి ప్రజలకు సాయం చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.
రూపురేఖలు కోల్పోయిన పొలాలు..
బూర్గంపాడు మండలం సంజీవ్‌రెడ్డిపాలెం, మణుగూరు మండలం చిన్నరాయగూడెం, అశ్వాపురం మండలంలో పలు గ్రామాల్లో పొలాలు పూర్తిగా రూపులేకుండా పోయాయి. పత్తి, వరి కొట్టుకుపోయింది. పొలాల్లో మేటలను తొలగించాలంటే రూ.లక్షలు ఖర్చవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ యంత్రాలతో పూడికను తొలగిస్తే తప్ప పొలాలు కనిపించేలా లేవని కంటతడి పెట్టుకుంటున్నారు. ఈ ఏడాది అప్పుచేసి నాటిన పంటలు కోల్పోవడం ఒక ఎత్తయితే.. పొలాలు పనికిరాకుండా మారడం మరింత బాధాకరమని పేర్కొంటున్నారు. బ్యాంకులు, ప్రైవేటు వ్యాపారుల వద్ద ఎకరాకు రూ.15 వేల వరకు తెచ్చిన రుణాలు చెల్లించడం ఎలాగంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు.
దయనీయంగా పశువులు..
ఎటుచూసినా వరద, బురద మేటలతో పశుగ్రాసం కనిపించడమే లేదు. దీంతో ఆవులు, గేదెలు, మేకలను రైతులు పూర్తిగా వదిలివేశారు. కొందరు ట్రాక్టర్లలో మూగజీవాలను పునరావాస గ్రామాలకు తీసుకెళ్లారు. ఎండు గడ్డి వరదకు కొట్టుకుపోయింది. ఒండ్రు కారణంగా పచ్చగడ్డి కనిపించడం లేదు. ముంపు మండలాల్లో పశువులకు పశుగ్రాసాన్ని ప్రభుత్వం వెంటనే పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు.
వైద్య శిబిరాల వద్ద జనం..
వరదల కారణంగా గోదావరి పరీవాహకంలో శీతల వాతావరణం నెలకొంది. దీంతో పిల్లలు, వృద్ధులు తీవ్రమైన జలుబుతో బాధపడుతున్నారు. పునరావాస శిబిరాల్లో కొందరికి డయేరియా లక్షణాలున్నట్లు వైద్యసిబ్బంది తెలిపారు. వారిని సమీప పీహెచ్‌సీలకు తరలించినట్లు బూర్గంపాడు సెయింట్ మేరీ పాఠశాల శిబిరంలోని సిబ్బంది వివరించారు. ఇక్కడ 1400 మంది బాధితులకు ఆశ్రయం కల్పించారు.
కన్నీట కడెం..