తెలంగాణ

telangana

ETV Bharat / city

నత్త నడకన కలెక్టరేట్ల నిర్మాణాలు... మూడేళ్లైనా స్లాబుల దశలోనే పనులు - Khammam collectorate building

ప్రజలకు సులువుగా ప్రభుత్వసేవలు అందించే లక్ష్యంతో చేపట్టిన నూతన సమీకృత కలెక్టర్‌ కార్యాలయాల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఏడాదిలోగా అందుబాటులోకి తేవాలనుకున్న ఆచరణలో మాత్రం ముందుకుసాగట్లేదు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో నిర్మాణాలు ప్రారంభించి మూడేళ్లైనా... ఇంకా స్లాబుల దశలోనే ఉన్నాయి. గుత్తేదారుల అలసత్వంతో పాటు అధికారుల పర్యవేక్షణ లేమితో కొత్త కలెక్టరేట్లు ముందుకు కదలట్లేదన్న విమర్శలు వస్తున్నాయి.

Khammam collectorate building works delaying
Khammam collectorate building works delaying

By

Published : Feb 18, 2021, 4:15 AM IST

ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలన్ని ఒకే చోట ఉండేలా... నూతన సమీకృత కలెక్టరేట్‌ భవనాలు నిర్మిస్తున్నారు. వివిధ పనుల కోసం వచ్చే ప్రజలకు సులువుగా పనులు జరగటంతో పాటు పరిపాలన సౌలభ్యం కలుగుతోందని ఆలోచన చేసి కార్యాచరణ మెుదలుపెట్టారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నూతన కలెక్టర్‌ కార్యాలయ భవన నిర్మాణాలు మందకోడిగా సాగుతున్నాయి. 2017లోనే నిర్మాణాలు ప్రారంభించినా.... ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇటీవల కలెక్టరేట్‌ నిర్మాణాలపై సమీక్షించిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి....పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.

ఖమ్మం శివారులోని రఘునాథపాలెం మండలం వి. వెంకటాయపాలెంలో 20 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టారు. 2017లో భూమిని గుర్తించి.... ఏడాదిలో భూ సేకరణ పూర్తిచేసి పనులు ప్రారంభించారు. ఇందుకు సుమారు 35 కోట్ల నిధులు కేటాయించారు. జీ ప్లస్ టూతో 4 బ్లాకులుగా నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. కానీ, నిర్మాణాలు ఇంకా స్లాబు దశలోనే ఉన్నాయి. భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం-పాల్వంచ మధ్య నూతన కలెక్టరేట్ నిర్మాణానికి 2018 ఏప్రిల్ 3న మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన చేశారు. 25 ఎకరాల్లో సుమారు 45 కోట్లతో నిర్మించ తలపెట్టిన పనుల్లో జాప్యం జరుగుతోంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సమీకృత కలెక్టర్‌ కార్యాలయాలు ఏడాదిలోనే అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే... రెండు జిల్లాల్లోనూ భవన నిర్మాణాలు మూడేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. ఎంపిక సమయంలో తీవ్ర జాప్యానికి తోడు అనేక వివాదాలు చుట్టుముట్టడంతో పనుల్లో వేగం పుంజుకోలేదు. ఆ తర్వాత సమస్యలు అధిగమించి పనులు చేపట్టినా.... అనుకున్న లక్ష్యం చెరలేదు. నిధులు సకాలంలో రావడం లేదన్న సాకుతో గుత్తేదారులు అలసత్వం ప్రదర్శించడంతో పాటు కరోనా ప్రభావంతో ఆలస్యం జరుగుతోంది.

సమీకృత కలెక్టర్‌ కార్యాలయ నిర్మాణాలపై అధికారులు, ప్రజా ప్రతినిధులు పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తే 6 నెలలు పట్టే అవకాశం ఉంది. లేదంటే మరో ఏడాది వేచిచూడక తప్పదు.

ఇదీ చూడండి:'రామోజీ ఫిల్మ్​ సిటీ' పర్యటకం మళ్లీ షురూ

ABOUT THE AUTHOR

...view details