కష్టంలో ఉంటే ఆదుకునే వారు చాలా తక్కువ మంది. ఉన్నంతలో సాయం చేసే వారు ఇంకొంతమంది. కానీ ఉన్న సమస్య గురించి సమాచారామందిన వెంటనే స్పందించే ఏకైక వ్యక్తి మాత్రం సోనూసూదే. కరోనా సృష్టించిన విలయ తాండవంలో రోడ్డున పడిన ఎందరికో బాసటగా నిలిచిన సోనూసూద్.. ఎందరికో దేవుడు అయిపోయారు. రీల్‌లైఫ్‌లో సోనూసూద్ విలన్. తెరపై అద్భుత నటనతో ఆకట్టుకుంటున్నారు. విలనిజం అంటే ఇలానే ఉండాలి అనే మార్క్‌ను సృష్టించారు. నిజజీవితంలో మాత్రం ఎంతో సౌమ్యంగా ఉంటూ అందరికీ సాయం చేస్తున్నారు. ఒకప్పుడు సోనూ అంటే పేరు మాత్రమే. ఇప్పుడు మాత్రం వలసకూలీల పాలిట దైవంగా మారారు.
బాబుకు గుండె ఆపరేషన్..
ఖమ్మం జిల్లాకు చెందిన కంచెపోగు కృష్ణ, బిందుప్రియ దంపతులకు ఈ ఏడాది ఓ బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టుకతోనే గుండెల్లో సమస్య ఏర్పడింది. దీనిని గుర్తించిన వైద్యులు.. ఆపరేషన్ చేసేందుకు రూ. ఆరు లక్షలు ఖర్చు అవుతాయని తెలిపారు. కృష్ణ ఓ ప్రైవేటు ఉద్యోగి కావడంతో చిన్నారి వైద్యం కోసం అంత డబ్బు లేకపోవడంతో తల్లడిల్లిపోయాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా తిరువూరులో ఉన్న జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు తెలుసుకుని సినీనటుడు సోనూసూద్‌కు తెలిపారు.
దీనిపైన వెంటనే స్పందించిన సోనూసూద్..వారిని ముంబయి రప్పించుకున్నారు. ముంబయిలోని వాడియా ఆస్పత్రిలో ఆ బాబుకు శనివారం గుండె ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం కూడా బాగుందని వైద్యులు వెల్లడించారు. వెంటనే స్పందించి చిన్నారికి ఊపిరి పోసినందుకు గాను సోనూసూద్ కి కృష్ణ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.
భయపడొద్దు, నేనున్నానంటూ భరోసా..
కొన్నిరోజుల క్రితం వరకు అతి సాధారణంగా కనిపించిన నటుడు సోనూసూద్.. ప్రస్తుతం చాలామందికి ఆపద్బాంధవుడిగా మారాడు. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ రైతు.. ఎద్దుల్లేక తన కుమార్తెలతో ఇటీవలే కాడి మోయించాడు. దానిని వీడియో తీసిన ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. ఎక్కడో ముంబయిలో ఉన్న ఓ సాధారణ నటుడు అది చూసి.. మీకు నేనున్నాను, తర్వాతి రోజు ఉదయానికల్లా ఎద్దుల జత అందేలా ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చాడు. ఎద్దులైతే మళ్లీ ఇబ్బంది రావొచ్చేమోనని, ఏకంగా ట్రాక్టర్‌నే వాళ్ల ఇంటికి పంపించాడు. ఇలా వీళ్ల ఒక్క కుటుంబానికే కాదు.. లాక్డౌన్ ప్రభావంతో వలసకూలీల నుంచి విదేశాల్లో చిక్కుకుపోయిన విద్యార్థుల వరకు చాలామందికి తన సొంత ఖర్చులతో చేతనైనా సాయం చేశాడు. ఏం భయపడొద్దు, తానున్నానంటూ భరోసా కల్పించాడు.