Pedpadalli Railway Bridge sanctioned by central government: దిల్లీ-కాజీపేట రైలుమార్గంలోని పెద్దపల్లి ప్రజల నాలుగు దశాబ్దాల ఎదురుచూపులకు ఫలితం దక్కబోతోంది.పెద్దపల్లి-కూనారం రైల్వేగేటుపై ఓవర్ బ్రిడ్జి కావాలని అక్కడి ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు.పెద్దపల్లి జిల్లా కేంద్రం కావడంతో పాటు..కాజీపేట-దిల్లీ మార్గంలో మూడో రైల్వేలైన్ ఏర్పాటుతో ఇరువైపులా ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది.రైళ్ల సంఖ్య పెరగడంతో ఒక్కోసారి రైల్వేగేట్ మూసివేస్తే కనీసం అరగంట ఆగిపోవల్సిన పరిస్థితి ఉండేది.తాజాగా ఆర్‌ఓబీ మంజూరు కావడంతో ఆ సమస్య పరిష్కారం కాబోతోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
పెద్దపల్లి జిల్లా కేంద్రం కావడంతో పట్టణానికి వచ్చేవారి సంఖ్య పెరిగింది. జమ్మికుంట, హన్మకొండ, కాల్వశ్రీరాంపూర్, మంథని, ఓదెల మండలాల రైతులు, ప్రజలు అవసరాల కోసం పెద్దపల్లికి వస్తుంటారు. కాజీపేట-దిల్లీ మార్గంలో మూడో రైల్వేలైన్ ఏర్పాటుతో రైళ్ల రాకపోకలు పెరిగాయి. ఈక్రమంలో పెద్దపల్లి-కూనారం రైల్వేగేటు వద్ద తరుచుగా రైల్వేగేట్ వేసేవారు. వాహనదారులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. ఈమార్గంలో విశాఖ, సికింద్రాబాద్, తిరువనంతపురం, చెన్నై, బెంగుళూరు నుంచి రైళ్లు ముమ్మరంగా దిల్లీవైపు పరుగులు పెడుతుంటాయి. అదేవిధంగా దిల్లీ నుంచి కాజీపేటవైపు వెళ్లే రైళ్ల సంఖ్యకూడా అదే స్థాయిలో ఉంటుంది.