KTR Sircilla Tour: సిరిసిల్ల చాలా అభివృద్ధి చెందింది... ఇంకా చేయాల్సింది ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక్కడ గెలిచిన పార్టీ అధికారంలో ఉండదని సెంటిమెంట్ ఉండేదని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత ట్రెండ్ మారిందన్నారు. నేడు సిరిసిల్లలో పర్యటనకు వెళ్లిన కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. వెంకంపేట రోడ్డు, జూనియర్ కాలేజ్ గ్రౌండ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
సిరిసిల్లలోనూ వీవర్స్ పార్కు.. 'సిరిసిల్లలో చాలా మంది మహానుభావుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి. పోరాటాలు చేసిన ఉద్యమనేతల విగ్రహాలు ఏర్పాటు చేద్దాం. విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది. వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్ నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ కూడా వీవర్స్ పార్కు నిర్మిస్తున్నాం. 2004లో కేసీఆర్ ఇక్కడ నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. రైతన్న చావకు అనే మాటలు గోడల మీద కలెక్టర్ రాయించారు. మీరు చావకండీ తెలంగాణ వస్తుంది అని ఆరోజు కేసీఆర్ అన్నారు' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.