హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచారం (Huzurabad by poll 2021) వినూత్నంగా సాగుతోంది. త్రిముఖపోటీ ఉన్నా రెండు పార్టీల మధ్యే నువ్వా-నేనా అన్నట్టుగా సాగుతోంది. తెరాస, భాజపా (TRS vs BJP) మధ్య ప్రచారం రసవత్తరంగా ఉంది. ప్రధాన పార్టీలు ఒక్కొక్కరు 20 మంది చొప్పున ప్రచార తారల పేర్లను ఎన్నికల సంఘానికి ఇచ్చినప్పటికి భాజపా నుంచి ఈటల దంపతులు.. తెరాస నుంచి హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ప్రచారాన్ని తమ భుజస్కంధాలపై వేసుకొని కొనసాగిస్తున్నారు.
హుజూరాబాద్‌లోనే మకాం...
ఈటల రాజేందర్(Etela Rajender)ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన ఎపిసోడ్ తరువాత నుంచి ఇప్పటివరకు తెరాస పట్టుకోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావనే చెప్పాలి. మంత్రులు తన్నీరు హరీశ్‌రావు (Minister Harish Rao), గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ హుజూరాబాద్ కేంద్రంగానే రాజకీయ సమీకరణాలు జరుపుతూ వస్తున్నారు. ఇప్పటికే స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హుజూరాబాద్‌లో పర్యటించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి మంత్రులు హరీశ్, గంగుల, కొప్పుల తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
గెలుపే లక్ష్యంగా...
ఆత్మీయ సమ్మేళనాలు, మహిళా సంఘాల సమావేశాలతో గెలుపు సునాయాసం చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపే లక్ష్యంగా (Huzurabad by poll 2021) సామాజిక వర్గాల సమీకరణాలు జరుపుతూనే ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ప్రచార సభలు, ఓటు బ్యాంకు ఉన్న వారిని అధికార పార్టీకి అనుకూలంగా మల్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఓటర్లను ప్రభావితం చేసే ఏ అంశాన్ని వదలకుండా పావులు కదుపుతున్నారు. 2004 నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఈటల కోటకు బీటలు తేవడమే లక్ష్యంగా మంత్రులు ముందుకు సాగుతున్నారు.