సింగరేణి బొగ్గు గనులు, ఎన్టీపీసీ విద్యుదుత్పత్తి కేంద్రాలతో గుర్తింపు పొందిన రామగుండం పారిశ్రామిక కేంద్రంలో మరో కర్మాగారం అందుబాటులోకి రానుంది. గతంలో మూతపడిన ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించడంతో రైతుల అవసరాలు తీరడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవనున్నాయి. కేంద్ర ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ కుబ ఆదివారం కర్మాగారాన్ని పరిశీలించి, సంసిద్ధతను సమీక్షించనున్నారు.
Ramagundam: రామగుండంలో మరో కర్మాగారం సిద్ధం - Another factory will be available at Ramagundam Industrial Estate
రామగుండం పారిశ్రామిక కేంద్రంలో మరో కర్మాగారం అందుబాటులోకి రానుంది. గతంలో మూతపడిన ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించడంతో రైతుల అవసరాలు తీరడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవనున్నాయి.
మూతపడిన ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) కర్మాగారం స్థానంలోనే రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) పేరిట కొత్త పరిశ్రమ రూపుదిద్దుకుంది. ఇందులో ఎఫ్‌సీఐ లిమిటెడ్ 26 శాతం, ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ 26, గెయిల్ 14.3, డెన్మార్క్‌కు చెందిన హాల్డర్ టాప్స్ సంస్థ 11.7, తెలంగాణ ప్రభుత్వం 11, భారత ఎరువుల సంస్థ 11 శాతం వాటా కలిగి ఉన్నాయి. రూ.6,160 కోట్లతో కర్మాగారాన్ని నిర్మించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ట్రయల్ రన్ నిర్వహించారు. తొలి ఉత్పత్తిని మొదట తెలంగాణకు కేటాయించాకే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇవీ ప్రత్యేకతలు
- రోజుకు 3,850 టన్నుల యూరియా, 2,200 టన్నుల అమ్మోనియా ఉత్పత్తి లక్ష్యం.
- వేపనూనె మిశ్రమంతో తయారు చేసిన యూరియాను కిసాన్ బ్రాండ్ పేరిట విక్రయించనుండగా 45 కిలోల బస్తా ధర రూ.266.50గా నిర్ణయించారు. ఇందులో 46.0 శాతం నైట్రోజన్ ఉండటం వల్ల భూసారం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
- సహజవాయువు ఇంధనంగా ఇక్కడ ఎరువులు ఉత్పత్తి చేస్తారు. అత్యాధునిక యంత్ర సామగ్రితో కర్మాగారాన్ని సిద్ధం చేశారు.
ఇదీ చదవండి:వందేళ్ల భారత నిరీక్షణకు తెర