వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి కాదని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణ అంశాన్ని యూపీఏ మేనిఫెస్టోలో చేర్చింది వైఎస్సేనని తెలిపారు. ఆయన మరణం తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైందని చెప్పారు. రాష్ట్ర ప్రజలను వైఎస్ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని పేర్కొన్నారు.
మహిళలంటే వ్రతాలే చేసుకోవాలా..
ఉద్యమంలో పాల్గొనకపోతే తెలంగాణపై ప్రేమ లేనట్లేనా అని షర్మిల ప్రశ్నించారు. తెలంగాణకు వ్యతిరేకమని తానెప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ మహిళలకు విలువ ఇవ్వరని ఆరోపించారు. తెరాసలో మహిళలకు గౌరవం ఉండదని విమర్శించారు. మహిళలంటే వ్రతాలే చేసుకోవాలని కేటీఆర్ అంటున్నారని మండిపడ్డారు. నిరుద్యోగుల కోసం తాను వ్రతమే చేస్తున్నానని అన్నారు.
నేను ప్రభంజనం సృష్టిస్తా..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మీద అలిగితే మాట్లాడం మానేస్తాను కానీ పార్టీ పెట్టను. పార్టీ అంటే వ్యక్తి కాదు... ప్రజలు, వ్యవస్థ. నేను ఉన్నా లేకున్నా పార్టీ కొనసాగుతుంది. నేను ఒంటరినని భయపడను, బాధలేదు. ఇది ప్రజల పార్టీ. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో పరిస్థితులు లేవు గనుక.. ఇక్కడ రాజన్న రాజ్యం తీసుకువచ్చేందుకు పార్టీ పెట్టాను. నేను ప్రభంజనం సృష్టిస్తా.. రాసి పెట్టుకోండి. ఏపీలో రాజన్న రాజ్యం వస్తున్నట్లే కనిపిస్తోంది. రాజన్న రాజ్యం రాకుంటే ప్రజలే తిరగబడతారు. కేసీఆర్ ఒక నియంత.. ఎవరూ ప్రశ్నించొద్దని అనుకుంటారు.