MP Vijayasai Reddy explan on land and propertys: ఏపీలోని విశాఖలో అక్రమాస్తులు కూడగట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి.. మంగళవారం విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కూర్మన్నపాలెంలో భూయజమానికి ఒక శాతం ఇచ్చి, ప్రాజెక్టు డెవలపర్ 99 శాతం తీసుకున్నారని.. ప్రపంచంలో ఎక్కడాలేనిది ఇక్కడే చూస్తున్నానని అనడం తీవ్ర చర్చనీయాంశమైంది. హయగ్రీవ ప్రాజెక్టుపై ఆయన చేసిన వ్యాఖ్యలు.. విశాఖలో స్థిరాస్తి దందా తీరుకు, అక్రమాలకు అద్దంపట్టాయి. దసపల్లా భూముల వ్యవహారంలో భూయజమానులుగా చలామణిలో ఉన్నవారికి 29 శాతం ఇచ్చి, డెవలపర్ 71 శాతం తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకోవడమే పెద్ద సంచలనమైతే.. ఎంపీ విజయసాయిరెడ్డి బయటపెట్టిన కూర్మన్నపాలెం ప్రాజెక్టు వ్యవహారం మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఏపీలోని కూర్మన్నపాలెం ప్రాజెక్టు స్థానిక వైకాపా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణదే. హయగ్రీవ ప్రాజెక్టులోనూ ఆయన భాగస్వామి. కూర్మన్నపాలెం ప్రాజెక్టు గురించి విజయసాయిరెడ్డి తనంతట తానే ప్రస్తావించడం రాజకీయంగానూ దుమారం సృష్టిస్తోంది. దసపల్లా భూములకు సంబంధించి 71 శాతం డెవలపర్ తీసుకుని, భూయజమానులకు 29 శాతం ఇవ్వడమేంటన్న ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా.. కూర్మన్నపాలెంలో డెవలపర్ 99 శాతం తీసుకుని, భూయజమానికి ఒక శాతం ఇస్తుంటే ఎందుకు అడగడం లేదని ఎదురు ప్రశ్నించారు. దాన్ని చర్చనీయాంశం చేయడం ద్వారా.. దసపల్లా వ్యవహారం నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారు.
వైకాపా నాయకుల మధ్య ఉన్న విభేదాలు, ఆధిపత్యపోరుకు.. సాయిరెడ్డి వ్యాఖ్యలు సాక్ష్యంగా నిలుస్తున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తన గురించి పార్టీలోని వ్యక్తులే మీడియాకు సమాచారం ఇస్తున్నట్లు కొందరు చెప్పారని, ఆధారాలుంటే వారిపై పార్టీపరంగా చర్య తీసుకుంటామని చెప్పడం.. పార్టీలో లుకలుకల్ని బయటపెట్టిందన్న చర్చ జరుగుతోంది. విశాఖకు ఇప్పటికీ తానే ఎంపీనని, ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకుంటానని అనడం ద్వారా.. పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జిగా తప్పించినా విశాఖపై తన పట్టు కొనసాగుతోందని చెప్పేందుకు సాయిరెడ్డి ప్రయత్నించారన్న అభిప్రాయం వైకాపా వర్గాల్లో వ్యక్తమవుతోంది.
కూర్మన్నపాలెంలో 10.57 ఎకరాల్లో ఓ భారీ బహుళ అంతస్తుల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. 2019లో పనులు ప్రారంభించారు. మొత్తం 15 లక్షల చదరపు అడుగుల భవనాలు నిర్మించేలా, అందులో కేవలం 14 వేల 400 చదరవు అడుగులు భూయజమానులకు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. అంటే డెవలపర్‌కు 99.04 శాతం వాటా ఇస్తే, భూయజమానులకు 0.96 శాతం మాత్రమే వస్తుంది. 2008లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఎండాడలో ఎకరా 45 లక్షల చొప్పున 12.51 ఎకరాలను హయగ్రీవ డెవలపర్స్ ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసింది. ఈ సంస్థ యజమాని జగదీశ్వరుడు. వివిధ అనుమతులు రావడంలో జాప్యం జరగడంతో ప్రాజెక్టు ఆలస్యమైంది.