రెండు వందలు పెట్టి చేపలు కొంటే ఇంటిల్లపాది తినేయొచ్చు అనుకుంటాం కానీ.. ఒక్క చేప ధర ఇరవై వేలు పలికిందంటే మాటలా..? కానీ.. ఇది నిజంగా జరిగింది. ధర ఎక్కువైనా.. తగ్గేదేలే అంటూ.. రేటుకు వెనకాడకుండా కొనడానికి పులస ప్రేమికులు సై అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా సమీపంలోని కేంద్ర పాలిత ప్రాంతం యానాంకు ఆనుకుని ప్రవహించే గౌతమి గోదావరిలో వరదల సందర్భంలో సముద్రం నుంచి.. పులస జాతికి చెందిన చేపలు వరద నీటికి ఎదురీదుకుంటూ ధవళేశ్వరం వరకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో మత్స్యకారులు వేసిన ప్రత్యేక వలలకు చిక్కుకుంటున్నాయి.
Pulasa Fish: ఆయ్ పులసండీ... రేటెంతో తెలిస్తే దిమ్మ తిరిగిపోద్దండీ! - telangana news
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సమీపంలోని కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో రెండు కేజీల బరువున్న పులస చేప రూ.20 వేల ధర పలికింది. కొనుగోలుదారులు ఏ మాత్రం వెనకాడకుండా తగ్గేదేలే.. అంటూ వేలం పాటలో పులసలను ఎగరేసుకుపోతున్నారు. పుస్తెలైనా అమ్మి.. పులస చేప కొనాలనే నానుడిని నిజం చేస్తున్నారు.
పదేళ్ల క్రితం ఈ సీజన్లో ఒకరోజు 100 నుండి 200 వరకు చేపలు మార్కెట్లోకి వచ్చేవని.. ఒక్కో చేప 1000 నుంచి 2000 వరకు ధర పలికేదని మత్స్యకారులు చెబుతున్నారు. సముద్రం ముఖద్వారాల వద్ద చమురు సంస్థల కార్యకలాపాలు ఎక్కువ కావడంతో గోదావరి నదీ పాయలలోకి చేపలు రావటం ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తోందని.. ఈ ప్రభావం చేపల ధరలపై పడుతుందని చెప్పారు. అందుకు తగ్గట్టే.. సోమవారం సాయంత్రం యానాం మార్కెట్లో ఒక పులస చేప రూ.20 వేల ధర పలికి రికార్డు సృష్టించింది. ఓ మహిళ.. ఈ చేపను ఇష్టంగా భారీ మొత్తానికి సొంతం చేసుకుంది.
ఇదీ చదవండి:CBI: ఆ కేసులో మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కీలక ఆధారాలున్నాయి