విద్యుత్ సౌధ ముట్టడికి మహిళా కాంగ్రెస్ ప్రయత్నం
12:31 April 07
Women Congress Protest : విద్యుత్ సౌధ ముట్టడికి మహిళా కాంగ్రెస్ ప్రయత్నం
Women Congress Protest : హైదరాబాద్ విద్యుత్ సౌధ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పెంచిన ఛార్జీలు తగ్గించాలంటూ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్యకర్తలు విద్యుత్ సౌధ ముట్టడికి యత్నించారు. పోలీసులకు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు మద్య తోపులాట కాస్త ఉద్రిక్తంగా మారింది. పోలీసులు నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేసే క్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకురాలు విద్యారెడ్డి తోపులాటలో కిందపడిపోయారు. ఆమెకు శ్వాస సమస్యలు తలెత్తడంతో హుటాహుటిన నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిమ్స్ వైద్యులు విద్యారెడ్డికి అత్యవసర వైద్యం అందిస్తున్నారు.
విద్యుత్ సౌధ వద్ద మిగిలిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం గోషామహల్ మైదానానికి తరలించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ ధర్నాలు చేపట్టింది. పీసీసీ అధ్యక్షుడు కూడా ఈ ధర్నాకు రావాల్సి ఉండగా పోలీసులు కాసేపు గృహ నిర్బంధంలో ఉంచారు. అనంతరం కార్యకర్తలతో కలిసి ఆయన విద్యుత్ సౌధకు బయలుదేరారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రంలో మోదీ.. రాష్ట్రంలో కేసీఆర్ రైతుల పాలిట శాపంగా మారారని రేవంత్ విమర్శించారు. తెరాస, భాజపాలు కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు.
ఇందిరాగాంధీ విగ్రహం నుంచి విద్యుత్ సౌధ వెళ్లే మార్గాలు మూసివేశారు. ర్యాలీలను అడ్డుకునేందుకు మార్గాలను బారికేడ్లతో బంద్ చేశారు. విద్యుత్‌సౌధ వైపు కాంగ్రెస్ నాయకులు వెళ్లకుండా పోలీసుల మోహరించారు. విద్యుత్ సౌధ వైపు ర్యాలీగా బయల్దేరిన రేవంత్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు వెళ్లిన క్రమంలో ఈ చర్యలు తీసుకున్నారు.