తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆస్తుల విలువ నిర్ధారణ గడువులోగా పూర్తవుతుందా.. ?

రాష్ట్రంలో ఆస్తుల నిర్ధారణ ప్రక్రియ కొంత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వివరాలను ధరణి పోర్టల్​లో నమోదుచేస్తున్న రిజిస్ట్రేషన్​ శాఖలో సిబ్బంది కొరత.. సమాచారలోపం ఇందుకు కారణమవుతున్నాయి. మధ్యలో ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం, సంబంధిత అధికారులను అడగాలను రిజిస్ట్రేషన్​ శాఖ అధికారులు భావిస్తున్నారు. సంబంధిత అధికారులు తమకు అందుబాటులో ఉంటే ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేసే వీలుందని అభిప్రాయపడుతున్నారు.

dharani
ఆస్తుల విలువ నిర్ధారణ గడువులోగా పూర్తవుతుందా.. ?

By

Published : Oct 3, 2020, 11:13 AM IST

రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, భవనాలు విలువలను నిర్ధారించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇంటి డోర్​ నంబర్లు, ఆయా భూములకు సంబంధించి సర్వేనంబర్లు ఆధారంగా ఆస్తుల విలువను నిర్ధారిస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ వద్ద ఇప్పటికే ఆస్తుల విలువలకు చెందిన సమాచారం ఉంది. ధరణి పోర్టల్​లో ఆయా విలువలను నమోదుచేసే బాధ్యతను ఆ శాఖకే ప్రభుత్వం అప్పగించింది.

5 నాటికే పూర్తికావాల్సి ఉన్నా..

ఈనెల 5 నాటికే ఆస్తుల విలువ నిర్ధారణ ప్రక్రియను పూర్తిచేయాలని.. రిజిస్ట్రేషన్‌ శాఖకు ప్రభుత్వం గడువు విధించింది. రిజిస్ట్రేషన్‌ శాఖ యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తోంది. ఇళ్ల డోర్ నంబర్ల వారీగా విలువలను నిర్ధారించాల్సిన ఉండడం.. జీహెచ్‌ఎంసీ, నగరపాలక, పురపాలక, పంచాయతీ అధికారులు ఇచ్చే డోర్‌ నంబర్లను, తమ వద్ద ఉన్న డోర్‌ నంబర్లు, విలువలను పరిశీలించి ధరణి పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంది.

అదే విధంగా భూములకు సంబంధించి.. రెవెన్యూ శాఖ ఇచ్చే సర్వేనంబర్లు ఆధారంగా తమ వద్ద ఇప్పటికే ఉన్న భూముల విలువను జత చేసి ధరణి పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంది. ఇక్కడే... అసలు సమస్య ఉత్పన్నమవుతోంది. కొన్ని ఆస్తులకు చెందిన విలువల సమాచారం.. రిజిస్ట్రేషన్‌ శాఖ వద్ద లేకపోవడం.. వారి వద్ద ఉన్న ఆస్తుల విలువలకు.. కొన్ని డోర్​ నంబర్లకు బేరీజు కాకపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

అసంపూర్తి సమాచారం..

స్పష్టంగా ఉన్న వివరాలు నమోదు పూర్తిచేసి.. అసంపూర్తిగా ఉన్న సమాచారంపై ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను అడగాలని రిజిస్ట్రేషన్​ శాఖ భావిస్తోంది. ఇవాళ.. భూములకు సంబంధించిన సర్వేనంబర్లను రెవెన్యూ అధికారులు.. రిజిస్ట్రేషన్ శాఖకు ఇవ్వనున్నారు. డోర్ నంబర్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో....అలాంటి పరిస్థితే భూముల విషయంలోనూ ఎదురవుతాయని అంచనా వేస్తున్నారు. రెవెన్యూ అధికారులను.. ప్రభుత్వాన్ని కానీ వివరణ కోరాలని.. వారిచ్చే సూచనల ఆధారంగా ముందుకు వెళతామని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.

12 గంటలు పనిచేసినా..

ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు ఆస్తుల విలువ నిర్ధారణ ప్రక్రియ పూర్తికావడానికి ప్రతీ సబ్​రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఆరేడు మంది కనీసం 12 గంటలు పనిచేయాల్సి ఉందని రిజిస్ట్రేషన్‌ శాఖ అంచనా వేస్తోంది. ఏ కార్యాలయంలోనూ చురుగ్గా పనిచేయగలిగే సిబ్బంది సరిపడినంత మంది లేరని.. ఒకరిద్దరున్నా వారంతా ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందేనని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వం తమకు అప్పగించిన పనిని సక్రమంగా పూర్తిచేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నా.. సిబ్బంది కొరతతో ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు.

ఆస్తుల విలువ నిర్ధారణ ప్రక్రియను పూర్తి చేసేందుకు మరికొంత సమయం ఇవ్వడం సహా కొరత ఉన్న చోట్ల ఇతర శాఖల సిబ్బందిని కేటాయించాలని కోరాలని భావిస్తున్నారు. డోర్‌ నంబర్లు, సర్వే నంబర్లు ఇచ్చిన శాఖలకు చెందిన అధికారులు.. తమకు తరచూ ఏర్పడే ఇబ్బందులను ఎక్కడిక్కడ సరిదిద్దేందుకు అందుబాటులో ఉంటే మరింత వేగవంతంగా ప్రక్రియ పూర్తవుతుందని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీచూడండి:ఆన్‌లైన్‌లోనూ అంతగా సాగని ప్రక్రియ.. ప్రైవేట్ సాయానికి అనుమతులు

ABOUT THE AUTHOR

...view details