TSRTC employees Retirement : ఉద్యోగుల పదవీ విరమణలు మొదలవుతాయా? మరో ఏడాది అవకాశం లభిస్తుందా? రాష్ట్ర ఆర్టీసీలో ప్రస్తుతం ఇవే చర్చనీయాంశాలుగా ఉన్నాయి. ఉద్యోగులకు మరో ఏడాది గడువు పెంచేందుకు వీలుగా అధికారులు ప్రభుత్వానికి దస్త్రాన్ని పంపారు. కానీ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. పెంపుదలపై కొందరు కండక్టర్లు, డ్రైవర్లు నిరాసక్తంగా ఉండగా అధికారులు, పరిపాలనా ఉద్యోగులు ఆసక్తితో ఉన్నట్లు సమాచారం.
58 నుంచి 60 ఏళ్లకు పెంపు..
Telangana RTC employees Retirement : ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ 2019 డిసెంబరులో పెంచారు. దాంతో రెండేళ్లుగా ఆర్టీసీలో పదవీ విరమణలు నిలిచిపోయాయి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును ప్రభుత్వం 61 ఏళ్లకు పెంచింది. ఒకపక్క అప్పులు, మరోవైపు నష్టాలతో ఆర్టీసీ ఆర్థికంగా కుదేలయింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తాలను గడిచిన కొన్నేళ్లుగా చెల్లించలేని స్థితి ఉంది. 2019 మార్చిలో రిటైర్ అయిన వారికి మాత్రమే సెలవులు, చివరి నెల జీతం తదితరాలను చెల్లించింది. ఆ తర్వాత పదవీ విరమణ చేసిన వారికి చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తం సుమారు రూ.100 కోట్లకుపైగా ఉంటుందన్నది అంచనా.