అల్పపీడన ప్రభావంతో.. ఏపీలో జోరు వానలు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనిపిస్తోంది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనమూ ఉండటంతో... దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న విజయనగరం వాసులకు... వానలు ఉపశమనం కలిగించాయి. పట్టణంలో సుమారు గంటపాటు ఓ మోస్తరుగా కురిసిన వర్షానికే వీధులన్నీ జలమయమయ్యాయి. 2 రోజులుగా కురుస్తున్న వానలతో పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. అరటి, వంగ, మొక్కజొన్న, వేరుశనగ పంటల రైతులు నష్టపోయారు. ఖండవల్లి ప్రాంతంలో తోటల్లోకి చేరిన నీటిని మోటార్ల సాయంతో బయటకు తోడారు. చింతలపూడి పట్టణంలో ఇళ్లల్లోకి నీరు చేరింది.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆదివారం ఉదయమంతా ఎడతెరిపి లేని వర్షం కురిసింది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ఎగువన తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా జిల్లా మున్నేరులో వరద పోటెత్తింది. పోలంపల్లి ఆనకట్ట వద్ద పది అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సూరేపల్లి గ్రామంలో గేదెల మేతకు కొండపైకి వెళ్లిన 8 మంది కాపరులు... కాసేపటి వరకూ వాగు అవతల చిక్కుకున్నారు.
కర్నూలు జిల్లా కొత్తపల్లి, పాములపాడు మండలాల్లో చెరువుకట్టలు తెగటంతో... రహదారులపైకి నీరు పొంగి పొర్లింది. దీనివల్ల పాములపాడు, చెలిమిళ్ల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నీరు చేరిన కాలనీలను సందర్శించిన ఎమ్మెల్యే ఆర్థర్... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులకు ఫోన్ చేసి.... కట్టలకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. నంద్యాల సమీపంలో కుందూ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పట్టణంలోని హరిజనవాడ వద్ద మద్దిలేరులో ప్రవాహం పెరగటంతో.... వంతెన నీటమునిగి రాకపోకలు నిలిచిపోయాయి
కడప జిల్లా పొద్దుటూరు వద్ద పెన్నానదిలో మట్టికట్ట కొట్టుకుపోయింది. మైలవరం జలాశయం నుంచి దిగువకు నీరు అధికంగా వదలటం వల్ల... ఆ ప్రవాహానికి తట్టుకోలేక కట్ట కొట్టుకుపోయింది. కమలాపురం మండలంలో ఎటుచూసినా నీరే దర్శనమిస్తోంది. ఇళ్లల్లోకి, పొలాల్లోకి భారీగా వర్షపునీరు చేరింది. మండలంలోని గంగవరం నుంచి ఏడురూరు, రాజుపాలెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇవాళ ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు.... కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది.
ఇదీ చదవండీ :స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతామంటూ మోసం