వరాహావతారంలో ఉన్న విష్ణుమూర్తి, భూదేవీల కుమారుడే నరకాసురుడు. సంధ్యవేళ... చీకటి, నిద్ర, అజ్ఞానం, కామం వంటి దుర్లక్షణాలకు ప్రతినిధి. నరకాసురునిలో కూడా మంచిని తుంచే చెడు లక్షణాలు ఉన్నాయని సూచించడానికి అతను సంధ్యవేళలో రూపాన్ని ధరించాడని చెబుతారు.
దేవుని కుమారుడైనా... మరణం తప్పలేదు
దేవకుమారుడైనా... నరకాసురునిలో అసుర లక్షణాలున్నాయి. తన తపస్సును మెచ్చిన పరమేశ్వరుడు తల్లి చేతిలో తప్ప ఎవరి చేతిలోనూ మరణం లేని విధంగా వరం ప్రసాదిస్తాడు. గర్వంతో నరకాసురుడు అటు దేవతలనూ ఇటు మానవులనూ నానా బాధలు పెట్టసాగాడు. నరకుని అకృత్యాలు మీరిపోవడం వల్ల సత్యభామ అవతారాన్ని ధరించి భూదేవి.. తన కుమారుడి గుండెలను చీల్చి సంహరించింది.
- " నడవడి సరిగా ఉంటే ప్రపంచమే తన నెత్తిన పెట్టుకుంటుంది. కానీ అదే నడవడి దారి తప్పితే, సాక్షాత్తూ భగవంతుడే తన తండ్రి అయినా నాశనం తప్పదని నరకాసురుడి జీవితం తెలుపుతోంది. "
చెడు మైత్రి... ప్రాణానికి చేటు
నరకాసురునిలో అసుర లక్షణాలున్నా... మొదట్లో అవి బయటపడలేదు. బాణాసురుడు అనే రాక్షసునితో స్నేహం మొదలయ్యాక అతనిలో రాక్షసత్వం ప్రబలిందని పురాణాలు చెబుతున్నాయి. మిత్రుడు చెడ్డవాడైతే... మనలో ఉన్న బలహీనతలకు బలం చేకూరుతుందని దీనిద్వారా తెలుస్తోంది. ప్రాగ్జ్యోతిషాపురం అనే గొప్ప రాజ్యానికి రాజైనప్పటికీ ప్రపంచాన్నే జయించాలని అత్యాశపడ్డాడు. క్రోధం, మదం, కామం అనే దుర్లక్షణాల వల్ల నరకాసురుని వధ తప్పలేదు.
- " మిత్రుడు చెడ్డవాడైతే... మనలో ఉన్న బలహీనతలకు బలం చేకూరుతుంది."
కోరి తెచ్చుకున్న అంతం:
తన మానాన తను చక్కగా రాజ్యాన్ని పాలిస్తే నరకాసురుడికీ ముప్పుండేది కాదు. అరిషడ్వార్గాలన్నింటినీ అరువు తెచ్చుకున్న నరకాసురుడు, చావుని మాత్రం కొని తెచ్చుకున్నాడు.
దేవతలను, ప్రజలను బాధపెడుతున్న విషయం తెలుసుకున్న శ్రీమహావిష్ణువు, శ్రీకృష్ణుడిగా నరకాసురుడిపై యుద్ధాన్ని ప్రకటించి, సత్యభామగా జన్మించిన భూదేవిని వెంటబెట్టుకుని వెళతాడు. సతీసమేతంగా యుద్ధానికి వచ్చిన కృష్ణుడిని ఎగతాళి చేసిన నరకాసురుడు, సత్యభామ (భూదేవి) చేతిలో ప్రాణాలు కోల్పోతాడు
" ప్రహ్లాదుడు రాక్షసుని కడుపున పుట్టినా దేవునిగా మారాడు. నరకాసురుడు భగవంతుని కడుపున పుట్టినా రాక్షసునిగా అంతమొందాడు." నరకాసురుని చావు పండుగగా మారిందంటే అతని జీవితం ఎంత గొప్ప గుణపాఠమో అర్థం చేసుకోవచ్చు...