కాలజ్ఞాన సృష్టికర్తగా.. భవిష్య పరిణామాలను ముందే ఊహించి తదుపరి తరాల వారిలోనూ ఆసక్తిని రేకిత్తించిన.. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో.. పీఠాధిపతి కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఏపీలోని కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో.. శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి (Sri pothuluri Veerabrahmendraswamy) ఆలయం ఉంది. కాలజ్ఞాన సృష్టికర్త వీరబ్రహ్మేంద్రస్వామి జీవసమాధి అయిన కందిమల్లయ్యపల్లె ప్రాంతమే నేటి బ్రహ్మంగారిమఠం. ఏటా లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తారు. అంతటి ఖ్యాతిగాంచిన ఆలయంలో బ్రహ్మంగారి వారసులుగా చెప్పుకునే 8వ తరం 11వ పీఠాధిపతి.. వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి ఈ నెల 8న అనారోగ్యంతో పరమపదించారు. ఆయన తదనంతరం పీఠాధిపతి ఎవరనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది.
వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు కాగా.. రెండో భార్యకు మైనర్లు అయిన ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు భార్యల కుమారులు వారసత్వం, పీఠాధిపత్యం కోసం పట్టుబడుతుండటంతో పరిస్థితి జటిలంగా మారింది. తన తదనంతరం వారసత్వపు హక్కులు ఎవరికి ఇవ్వాలనే దానిపై పీఠాధిపతి వెంకటేశ్వరస్వామి ఇరువురికీ వీలునామా రాసినట్లు రెండు కుటుంబాల వారు చెబుతున్నారు.