తెలంగాణ

telangana

ETV Bharat / city

vice chancellor : విద్యార్థుల సొమ్ముతో దుబారా చేస్తున్న వీసీలు - telangana vice chancellors

నాణ్యమైన విద్య అందించి... ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా చర్యలు చేపట్టాల్సిన విశ్వవిద్యాలయాల ఉపకులపతులు(vice chancellor) వచ్చీ రావడంతోనే కార్యాలయాలు, ఇళ్ల హంగులపైనే దృష్టంతా కేంద్రీకరించారు. అవసరం లేకున్నా పనులు చేస్తూ నిధుల దుబారాకు తెరతీశారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు పిలవకుండా నామినేషన్‌ విధానంపై పనులు చేస్తున్నారు. జేఎన్‌టీయూహెచ్‌లో ఇది మరీ శ్రుతిమించింది.

విద్యార్థుల సొమ్ముతో దుబారా చేస్తున్న వీసీలు
విద్యార్థుల సొమ్ముతో దుబారా చేస్తున్న వీసీలు

By

Published : Jul 22, 2021, 8:50 AM IST

జేఎన్‌టీయూహెచ్‌ పరిపాలన భవనంలో ఉపకులపతి(vice chancellor), రిజిస్ట్రార్‌, రెక్టార్‌, ఓఎస్‌డీ కార్యాలయాలతో పాటు అకడమిక్‌ ప్లానింగ్‌ విభాగం(డీఏపీ), అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ తదితర విభాగాలు పనిచేస్తున్నాయి. కొత్తగా వచ్చిన ఉపకులపతి వాటిని అడ్మిషన్‌ బ్లాక్‌లోకి తరలించాలని నిర్ణయించారు. దీంతో ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు తొలుత అక్కడ ఉపకులపతి కార్యాలయాన్ని సిద్ధం చేస్తున్నారు. అడ్మిషన్‌ బ్లాక్‌లోని ఒక అంతస్తు మొత్తం పరిపాలన భవనానికి కేటాయించాలన్నది ప్రణాళిక. అందుకు కనీసం రూ.కోటిన్నర ఖర్చవుతుందని అంచనా వేసినట్లు తెలిసింది. అధికారులు ఈ వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. ఈ నెల 30వ తేదీన జరిగే పాలకమండలి సమావేశంలో వాటికి ఆమోదం పొందాలని భావిస్తున్నారు.

వాస్తవానికి ఇప్పుడు పరిపాలన భవనంలో కార్యాలయాలు బాగానే ఉన్నాయి. వర్సిటీ పరిధిలో భారీ సంఖ్యలో కళాశాలలు మూతపడ్డాయి. ఇప్పటికే 30కి పైగా కళాశాలలు యూజీసీ అటానమస్‌ హోదా పొందాయి. మరో 15 వరకు అదే బాటలో ఉన్నాయి. ఫలితంగా వర్సిటీ ఆదాయం కూడా గణనీయంగా తగ్గిపోతోంది. గతంలో మాదిరిగా కళాశాలల ప్రతినిధులు విశ్వవిద్యాలయాలకు వచ్చే అవసరం అంతగా ఉండదు. ఈ పరిస్థితుల్లో కార్యాలయాలను మరో భవనంలోకి మారుస్తుండటంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రవేశాల భవనంలోకి తరలిస్తే అక్కడ కౌన్సెలింగ్‌లు, ప్రవేశాల కోసం వచ్చే విద్యార్థులు, తల్లిదండ్రులతో రోడ్డంతా కిక్కిరిసిపోతుంది. విద్యార్థులు ధర్నాల వంటివి చేస్తే, ఆ రోడ్డులో రాకపోకలు ఆగిపోతాయి. ప్రస్తుత భవనం వద్ద అలాంటి పరిస్థితి ఉండదు. ఇప్పటికే అడ్మిషన్‌ కార్యాలయంలో సీలింగ్‌ పనులు ప్రారంభమయ్యాయి. టెండర్లు పిలవకుండానే వీటిని చేపట్టడం గమనార్హం. ప్రభుత్వం నుంచి కేవలం వేతనాలకు మాత్రమే నిధులొస్తాయి. ఇతర అన్ని అవసరాలకు విద్యార్థులు చెల్లిస్తున్న ఫీజుల సొమ్మే ఆధారం. అధికారులు ఆ నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారు.

ప్రీ ఆడిట్‌ పేరిట అధికారం కేంద్రీకృతం

అకౌంట్స్‌ విభాగాన్ని బలోపేతం చేసే పేరుతో ప్రీ ఆడిట్‌ సెల్‌ ఏర్పాటు చేస్తూ బిల్లుల చెల్లింపునకు కేంద్రీకృత విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఇప్పటివరకు ఆయా విభాగాల సంచాలకులు, ప్రిన్సిపాళ్లు రూ.లక్ష వరకు బిల్లులు చెల్లించేందుకు చెక్‌ పవర్‌ ఉండేది. ఇప్పుడు ఒక్క రూపాయి ఖర్చు చేయాలన్నా ఫైనాన్స్‌ అధికారి బిల్లులు క్లియర్‌ చేయాల్సిందే. దానివల్ల జగిత్యాల, మంథని, సుల్తాన్‌పూర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు కూడా బిల్లులు ఇక్కడికి పంపించాల్సి వస్తుంది. దీనివల్ల పనుల్లో వేగం తగ్గుతుందని ఆచార్యులు అభిప్రాయపడుతున్నారు.

ఓయూ వీసీ నివాసానికి రూ.6 లక్షలు

ఓయూలోని ఉపకులపతి(vice chancellor) లాడ్జి(నివాసం)కి రంగులు వేయడం, గృహోపకరణాలు, ఫర్నిచర్‌ కొనుగోలు, చిన్న చిన్న మరమ్మతులు చేసేందుకు రూ.6 లక్షల వరకు ఖర్చు చేశారు. వాస్తవానికి ఉపకులపతిగా ఆచార్య రామచంద్రం ఉండగా నాలుగేళ్ల కిందట రూ.10 లక్షలతో ఆయా పనులు జరిగాయి. ఇంకా ఆ భవనంలో కొన్ని మార్పులు చేసేందుకు ఉన్నతాధికారులు సూచిస్తున్నా సిబ్బంది అది వీలుకాదని చెబుతున్నట్లు తెలిసింది. పాలమూరు వర్సిటీలో నిర్మించిన ఉపకులపతి భవనానికి రోడ్డు వేస్తున్నారు. నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో వీసీ లాడ్జిని సిద్ధం చేసేందుకు అవసరమైన పనులు వేగంగా జరుగుతున్నాయి.

వీసీ ఇంటికి రూ.25 లక్షలా?

జేఎన్‌టీయూహెచ్‌ ప్రాంగణంలో ఉపకులపతి(vice chancellor) లాడ్జి (నివాసం)కి రంగులు వేయడం, ఫర్నిచర్‌, ఫ్రిజ్‌, బెడ్లు, పరుపుల వంటి గృహోపకరణాల కొనుగోలుకు నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ. 25 లక్షల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం రూ.లక్షకు మించిన పనులకు ఈ- ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్‌ పిలవాలి. అందుకు భిన్నంగా ఇక్కడ పనులను నామినేషన్‌పై అప్పగించినట్లు తెలిసింది.

ABOUT THE AUTHOR

...view details