దిగ్ఘస్తిభిః కనక కుంభముఖావసృష్ట
స్వర్వాహినీ విమల చారుజలప్లుతాంగీం
ప్రాతర్నమామి జగతాం జననీమశేష
లోకాధినాథగృహిణీం అమృతాబ్ధి పుత్రీం
ఏనుగులతో అభిషేకం అందుకుంటున్న శ్రీమహాలక్ష్మిని ఉదయం లేవగానే స్మరిస్తే ఇంట్లో, ఒంట్లో కూడా దారిద్య్రం ఉండదన్నారు ఆదిశంకరాచార్యులు.
అదేంటోగానీ లోకంలో చాలామంది లక్ష్మి ఉన్నా లేదని, సరస్వతి లేకున్నా ఉందని చెబుతారు. ఇంతకీ లక్ష్మి అంటే కేవలం డబ్బనుకుంటున్నారా?! నిజానికి ‘లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధ దృష్ట్యా యయా అనిశం’ అన్నారు. అంటే జగతిని అన్నివేళలా కనిపెట్టుకు ఉండేది లక్ష్మి అని అర్థం. దీన్ని బట్టి విశ్వమంతా లక్ష్మీమయమే. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి- ఇలా అష్టలక్ష్ముల రూపంలో అలరిస్తుంది. అంతేనా.. ఇలలో భూలక్ష్మిగా, ఇంట్లో గృహలక్ష్మిగా, పరలోకంలో స్వర్గలక్ష్మిగా అంతటా ఉండి వెలుగులు నింపుతుంది.
కమలనయన! నీవు కలచోటు సరసంబు
నీవు లేని చోటు నీరసంబు
కంబుకంఠి! నీవు కలవాడు కలవాడు
లేనివాడు నీవు లేని వాడు
అన్నాడు శ్రీనాథుడు. అలాంటి లక్ష్మీదేవిని శ్రావణంలో వరలక్ష్మిగా కలశరూపంలో ఆరాధిస్తాం. జలం, దర్భ, పసుపు, కుంకుమ తదితరాలను మంత్రించి ఆవాహన చేస్తే దేవతలు కరుణిస్తారట.
మన పురాణాల్లో లక్ష్మి రాకపోకల గురించిన కథ ఒకటుంది. ఒకసారి ఇంద్రుడు అహంకారంతో విష్ణుప్రసాదాన్ని ధిక్కరించాడు. ఆనక పశ్చాత్తాపంతో హరి వద్దకు వెళ్లగా ‘శుచీశుభ్రత, సదాచారం, ప్రేమానురాగాలు, దైవారాధనలు ఉన్నచోట, సత్యభాషణం, ధర్మనిష్ఠత, గోసేవ, విష్ణుసేవ వంటివి పాటించే ఇళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది. చిరిగిన దుస్తులు ధరించడం, కఠినంగా మాట్లాడటం, సూర్యోదయ, సూర్యాస్తమయాల్లో నిద్రించటం.. లాంటి పనులు చేసేవారి ఇళ్లలో లక్ష్మి క్షణమైనా ఉండదు’ అంటూ వివరించాడు శ్రీహరి.