Uyyalawada Narasimha reddy: ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం రూపనగుడిలో నరసింహారెడ్డి జన్మించారు. తండ్రి పెదమల్లారెడ్డి ఉయ్యాలవాడ పాలెగాడుగా పనిచేసేవారు. తల్లి నీలమ్మ ఇంటిపనులు చక్కబెట్టేది. అలా ఉయ్యాలవాడలోనరసింహారెడ్డి బాల్యం గడిచింది. చిన్నప్పటి నుంచి ఆటపాటలతో పాటు అన్నింటిలో చురుగ్గా ఉండేవారు నరసింహారెడ్డి. యుక్తవయస్సులో ఆయనకు వివాహం అయ్యింది. నరసింహారెడ్డికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య సిద్దమ్మ, రెండో భార్య పేరమ్మ. మూడో భార్య ఓబులమ్మ. నరసింహారెడ్డికి తండ్రి తరఫున బ్రిటీష్ వారి నుంచి 11 రూపాయల 10 అణాల 8 పైసలు భరణంగా వచ్చేది. తనకు రావాల్సిన భరణం రాకపోవడంతో కోవెలకుంట్లలోని ట్రెజరీకి తన అనుచరుడిని పంపించారు నరసింహారెడ్డి. ముష్టి తీసుకునే వాడికి మరొక ముష్టివాడా అంటూ కోవెలకుంట్ల తహసీల్దారు రాఘవాచారి అవహేళన చేశాడు. కోపోద్రిక్తుడైన నరసింహారెడ్డి ట్రెజరీని కొల్లగొట్టి నీ ప్రాణాలు తీస్తాను.. చేతనైతే రక్షించుకో అంటూ లేఖ రాశారు. అప్పుడు తహసీల్దారుకు బ్రిటీషు సైన్యం రక్షణగా నిలిచింది. అన్న మాట ప్రకారం 1846 జులై 10న మధ్యాహ్నం 12 గంటలకు.. కోవెలకుంట్లలోని ట్రెజరీపై తన అనుచరులతో దాడిచేసి తహసీల్దారు శిరస్సు ఖండించారు. ట్రెజరీ అధికారి థామస్ ఎడ్వర్టుకి గుండు గీయించారు. 'దమ్ముంటే మరుసటి రోజు సాయంత్రం నయనాలప్ప వద్ద కలుసుకోమను' అని చెప్పి.. 8 వందల 5 రూపాయల 10 అణాల 4 పైసలను కొల్లగొట్టి బ్రిటీషు సైన్యానికి సవాలు విసిరాడు. తర్వాత ప్రొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానాను సైతం నరసింహారెడ్డి దోచుకున్నాడు.
తెల్లవారికి భయం పరిచయం
ఈ ఘటనల తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం తనపై దాడి చేస్తుందని ముందే ఊహించిన నరసింహారెడ్డి... అవుకు రాజు నారాయణరాజు సహకారంతో సైన్యం, ఆయుధ సామాగ్రిని సిద్ధం చేసుకున్నారు. కోట చుట్టూ కందకాలు తవ్వించాడు. శత్రు సైన్యం వేగంగా నడవకుండా కోట చుట్టూ ఉన్న పొలాలను నీటితో తడిపించారు. కోటను ఎక్కడానికి ప్రయత్నించేవారిపై సలసల కాగే నూనెను కుమ్మరించే ఏర్పాట్లు చేశారు. శతఘ్నులు సిద్ధం చేసుకున్నారు.1846 జులై 23న బ్రిటీషు సైన్యం నొస్సం కోటపైకి దాడికి పాల్పడింది. అప్పటికే అప్రమత్తమైన నరసింహారెడ్డి... శత్రువులపై ఎదురుదాడికి దిగారు. పక్కా ప్రణాళికలు రచించడంతో ఆంగ్లేయుల సైన్యం చెల్లాచెదురైంది. ప్రాణభయంతో పారిపోతున్న కెప్టెన్ వాట్సన్‌ను వెంటాడిన నరసింహారెడ్డి తలను ఒక్కవేటుతో నరికి తెల్లవారికి భయాన్ని పరిచయం చేశారు. నరసింహారెడ్డి ఉగ్రరూపంతో ఆంగ్లేయులు రగిలిపోయారు. ఎప్పుడైనా కోటపై దాడి జరగొచ్చనే అనుమానంతో ఆయన గురువు గోసాయి వెంకన్న సూచన మేరకు... నల్లమల అడవుల్లోని వన దుర్గంలోకి మకాం మార్చారు నరసింహారెడ్డి. ఆ ప్రాంతానికి అటవీశాఖాధికారి పీటర్. ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయడం, ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించడం చేసేవాడు. ఓ రైతు ద్వారా విషయం తెలుసుకున్న ఉయ్యాలవాడ.. పీటర్‌ను వేటాడి చంపాడు. దీంతో రుద్రవరం సహా కంభం చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పండగ చేసుకున్నారు.
భయకంపితులైన ఆంగ్లేయులు
నరసింహారెడ్డి విజృంభణతో భయకంపితులైన ఆంగ్లేయులు ప్రతీకారం కోసం వేచిచూశారు. నరసింహారెడ్డి ఆచూకీ చెప్పిన వారికి రూ.5 వేలు, సజీవంగా గానీ నిర్జీవంగా గానీ పట్టిచ్చినవారికి రూ.10 వేల రూపాయలు బహుమతిని ప్రకటించారు.. అప్పటి కడప కలెక్టర్ కాక్రేన్. తర్వాత నరసింహారెడ్డి నొస్సం కోటను ఫిరంగులతో కూల్చి వేశారు కెప్టెన్ నార్టన్. నరసింహారెడ్డిని పట్టించాలని రుద్రవరం తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి ఎత్తులు వేశాడు. దువ్వూరులో జరిగే ఎల్లమ్మ జాతరకు నరసింహారెడ్డిని ఆహ్వానించాలని ఆయన స్నేహితుడు రోశిరెడ్డితో ఆహ్వానం పంపించాడు శ్రీనివాసరెడ్డి. దీన్ని పసిగట్టలేకపోయిన నరసింహారెడ్డి జాతరకు వచ్చారు. అక్కడ ఆంగ్లేయులు కాపుకాసిన విషయాన్ని తెలుసుకుని.. తెలివిగా తప్పించుకున్నారు. తర్వాత మార్కాపురం, అనంతపురం, చిత్తూరు జమీందారులు సహా కర్నూలు నవాబు పాపాఖాన్‌ల మద్దతు సమకూర్చుకున్నారు. తన తమ్ముడి ఆదరాభిమానాలను ఓర్వలేని సోదరుడు మల్లారెడ్డి.. బ్రిటీష్ వారికి నరసింహారెడ్డి కుటుంబం సమాచారం అందించాడు. భార్యా పిల్లల్ని బంధించి కడపలోని లాల్ బంగ్లాలో పెట్టాడు కలెక్టర్ కాక్రెన్. సాయం చేయకుండా కడప నవాబు మహమ్మద్ ఇబ్రహీం, కర్నూలు నవాబులను సైతం బంధించాడు. భార్య దొరసాని సుబ్బమ్మతో పాటు కొడుకు దొర సుబ్బయ్యలను రక్షించుకునేందుకు ఓ అర్ధరాత్రి వచ్చిన నరసింహారెడ్డి.. బంగ్లా అధికారి గుండెలపై కత్తి పెట్టి తనవారిని విడిపించుకుపోయారు. ఏం చేయాలో దిక్కుతోచక నరసింహారెడ్డిని ఆరాధించే 60 గ్రామాలపై బ్రిటీష్ సైనికులు దాడి చేశారు. కనపడ్డ వారందరినీ హింసించారు. స్త్రీలపై అత్యాచారాలు చేశారు. విషయం తెలుసుకున్న నరసింహారెడ్డి ప్రజల కోసం లొంగిపోవడానికి సిద్ధపడ్డారు.
మరణానికి సాగతం