Kishan Reddy on Bayyaram Steel Factory: బయ్యారంలో నాణ్యమైన ముడిఖనిజం లేదని స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా- సెయిల్.. నివేదిక ఇచ్చిందనీ.. అక్కడ పరిశ్రమ పెడితే పోటీలో నిలవలేమని అభిప్రాయపడిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఇదే విషయాన్ని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి సైతం రాజ్యసభలో చెప్పారని గుర్తుచేశారు. 200మిలియన్ టన్నుల ముడి ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉంటేనే పరిశ్రమ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ కమిటీ కూడా బయ్యారంలో స్టీల్‌ఫ్యాక్టరీ పెట్టొద్దని నివేదిక ఇచ్చిందన్నారు.
కేంద్రం సహకరించకపోయినా బయ్యారంలో ఉక్కు కర్మాగారం కట్టితీరుతామని స్వయంగా సీఎం కేసీఆర్ అన్నారన్న కిషన్‌రెడ్డి... ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలని డిమాండ్ చేశారు. నిపుణులు కమిటీ స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా తెరాస ప్రభుత్వం కేంద్రంపై విమర్శలు చేస్తోందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. బయ్యారం ఫ్యాక్టరీ నిర్మించి.. 10 నుంచి15 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని కేసీఆర్ చెప్పలేదా అని ప్రశ్నించారు.