jalshaktiDepartment letter: గోదావరి పరివాహక ప్రాంతంలోని 11 ప్రాజెక్టుల ఆమోదంపై రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసింది. గోదావరిలో 75 శాతం నీటి లభ్యత కింద ఉన్న 1486.155 టీఎంసీలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే తెలంగాణలో 967.94 టీఎంసీల ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని కేంద్రానికి రాసిన లేఖలో రాష్ట్రం పేర్కొంది. గోదావరి బేసిన్‌లో ఆమోదం లేనివిగా పేర్కొన్న 11 ప్రాజెక్టులు తెలంగాణ ఏర్పడకముందే ప్రారంభమయ్యాయని...ఇందులో 758.76 టీఎంసీల ప్రాజెక్టులను కేంద్ర జలసంఘం ఆమోదించిందని తెలిపింది. మరో 148.82 టీఎంసీల ప్రాజెక్టులకు జలసంఘంలోని హైడ్రాలజీ డైరెక్టరేట్ అంగీకారం తెలపగా 60.346 టీఎంసీలను భవిష్యత్తు ప్రాజెక్టులకు రిజర్వుగా పెట్టుకొన్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులకు నీటి లభ్యత సంబంధించినంత వరకు కేంద్ర జలసంఘం ఒక్కో ప్రాజెక్టును వేర్వేరుగా చూస్తుందని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ వివరణ ఇచ్చింది. ఆమోదం తెలిపిన 758.76 టీఎంసీల ప్రాజెక్టుల వివరాలతో పాటు హైడ్రాలజీ డైరెక్టరేట్ అంగీకరించిన 148.82 టీఎంసీలకు సంబంధించి కూడా 967.94 టీఎంసీల కేటాయింపు ఉందనడానికి ఆధారం చూపాలని కోరింది. 11 ప్రాజెక్టులలో 5 డీపీఆర్‌లను తెలంగాణ సమర్పించిందని... ఇవి పరిశీలనలో ఉన్నాయని మిగిలిన ఆరింటి వివరాలను ఇస్తే మదింపు చేస్తామని కేంద్రం పేర్కొంది.
'ఆమోదంలేని జాబితా నుంచి తొలగించాలి'
కాళేశ్వరం అదనపు టీఎంసీ పని కొత్తది కాదని.. కేంద్ర జలసంఘం ఈ ప్రాజెక్టుకు కేటాయించిన 240 టీఎంసీలను వినియోగించుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే పనులు చేపట్టామని రాష్ట్రం తెలిపింది. దీనికి కేంద్రం ఆమోదం అవసరం లేదని ఆమోదంలేని జాబితా నుంచి తొలగించాలని కోరింది. మొత్తం 240 టీఎంసీల నీటిని వాడుకోవడానికే అదనపు టీఎంసీ పని అయినా, ప్రాజెక్టు నిర్వహణలో మార్పులుంటాయన్న కేంద్రం.. నీటి లభ్యతను అంచనా వేసేందుకు హైడ్రలాజికల్ పరిశీలన చేపట్టాలని తెలిపింది. అదనపు టీఎంసీతో సహా అవసరమైన వివరాలను గోదావరి బోర్డుకు అందజేయాలని సూచించింది.