తెలంగాణ

telangana

ETV Bharat / city

Ugadi Festival 2022 : ఎన్నెన్నో భావోద్వేగాల సమ్మేళనం.. ఉగాది పర్వం - ఉగాది పచ్చడి

ఆనందాల తియ్యందనం.. అవమానాల చేదు.. కష్టనష్టాల కారం.. విమర్శల పులుపు.. నిరాశల వగరు.. జీవితసారం ఉప్పు.. జీవితంలో ఎన్నెన్ని భావోద్వేగాలు.. ఎంతెంత విలక్షణత్వం... అన్నింటినీ సమన్వయించుకుంటూ.. సమైక్యత ప్రదర్శిస్తూ.. ఆదాయం పెంచుకుంటూ వ్యయప్రయాసలు తగ్గించుకుంటూ జీవితాన్ని కోయిల గానంలా సాగించమని ప్రబోధిస్తోంది ఉగాది.

Ugadi Festival 2022
Ugadi Festival 2022

By

Published : Apr 2, 2022, 7:00 AM IST

ప్రకృతి అంతటా చైతన్యాన్ని నింపి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేదే ఉగాది. ‘ఉగ’ అంటే రథపు ముందుభాగం. కాలపురుషుని రథానికి చైత్రమాసం సారథిగా ముందుండి ఆ సంవత్సరాన్ని నడిపిస్తుంది కనుక ఉగాది అయ్యింది. యుగమంటే ఏడాది అనే అర్థమూ ఉంది. తెలుగు సంవత్సరానికి స్వాగతం పలికే పండుగ కనుక ఇది యుగాది.

బ్రహ్మ ఉగాది రోజే సృష్టి ఆరంభించాడంటారు. సోమకాసురుడు వేదాలను దొంగిలించగా శ్రీమహావిష్ణువు మత్స్యావతారంలో అతణ్ణి చంపి వేదాలను సురక్షితంగా బ్రహ్మకు అందించింది ఉగాది నాడేనని పురాణేతిహాసాల కథనాలు చెబుతున్నాయి. శకకర్త శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఇదేనని చరిత్ర చెబుతోంది.

ఐదు ఆచారాలు :సూర్యోదయానికి ముందే తనువుకు నూనె రాసి తలంటుకోవడం (తైలాభ్యంగనం) ఉగాది నాటి తొలి కర్తవ్యం.

  • ఇది కాల సంబంధ పండుగ కనుక దాన్ని ముందుకు నడిపించే సూర్యచంద్రులకు నమస్కరించాలి. అలాగే ఆ సంవత్సర అధిదేవతను పూజించి ఇష్టదేవతారాధన చేయాలి.
  • సర్వారిష్టాలూ తొలగి, సంవత్సరమంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేందుకు తోడ్పడేది ఉగాది పచ్చడి. ఆ ప్రసాదాన్ని సేవిస్తూ కింది శ్లోకాలను పఠించాలి.

అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్లఘృతైర్యుతం
భక్షితం పూర్వయామే తు తద్వర్షే సౌఖ్యదాయకం
శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ
సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం

పూర్ణకుంభదానం చేయాలి. అంటే ఉగాది రోజున శక్తిననుసరించి రాగి/ వెండి/ మట్టి పాత్రను నీటితో నింపి అందులో మామిడి, అశోక, నేరేడు, మోదుగ, వేప చిగుళ్లు, గంధం, పూలు, అక్షతలు వేసి పూజించాలి. ఆ కుండను గురువులకు కానీ పెద్దలకు కానీ ఇంటి పురోహితునకు గానీ ఇచ్చి ఆశీస్సులను పొందాలి.

పంచాంగ శ్రవణమూ ముఖ్యమే. 15 తిథులు, 7 వారాలు, 27 నక్షత్రాలు, 27 యోగాలు, 11 కరణాలు- వీటి కలయికే పంచాంగం. ఉగాది రోజు ఉత్తరాభిముఖంగా ఉండి పంచాంగ శ్రవణం చేయడం గంగాస్నానంతో సమానమైన ఫలితాన్నిస్తుంది.

తిథిర్వారం చ నక్షత్రం యోగః కరణమేవచ
పంచాంగస్య ఫలం శృణ్వన్‌ గంగాస్నాన ఫలం లభేత్‌

మితం... హితం...జీవితంలో కష్టం, సుఖం, లాభం, నష్టం, గెలుపు, ఓటమి అన్నీ ఉంటాయి. దేన్నయినా సమభావనతో స్వీకరించాలనేందుకు సంకేతంగా షడ్రుచులను సమ్మేళనం చేసి తినమన్నారు. ఆనందాలు మధురం, అవమానాలు కారం, పొరపాట్లు పులుపు, ఓటమి చేదు, కష్టనష్టాలు వగరు, ఏ రుచికైనా రుచినిచ్చేది ఉప్పు. జీవితంలో కష్టం తెలిసినప్పుడే మిగిలినవాటి రుచిని ఆస్వాదించగలం. ఉడికించడం / వేయించడం / కాల్చడం లాంటివేమీ లేకుండా కేవలం కలిపి రూపొందించేదే ఉగాది పచ్చడి. మన జీవితాన్ని మధురంగా మలచుకోవడంలో ఇతరుల ప్రమేయం ఉండదనేందుకు సంకేతమిది.

సాధారణంగా పండుగలకు చేసుకునే ప్రత్యేక పిండివంటలు రోజుల తరబడి తింటుంటాం. కానీ ఉగాది పచ్చడిని మితంగా చేసి కాస్త మాత్రమే తింటాం. జీవితం అశాశ్వతమని గుర్తుచేస్తుందిది. ‘రేపు’ ఉంటుందో లేదో తెలియదు కనుక ఈ రోజును సద్వినియోగం చేసుకోవాలన్న బాధ్యతను తెలియజేస్తుంది.రోగనిరోధక శక్తిని పెంచి అనారోగ్యాల బారిన పడకుండా చేస్తుంది.

ఎన్ని సంబరాలో..ఉగాదినాడు పంచాంగ శ్రవణమే కాదు.. కవిసమ్మేళనాలు, అవధానాలు, నృత్య ప్రదర్శనలు- ఇలా ఎన్ని సంబరాలో! ఏడాది ఎలా ఉండబోతోందో తెలుసుకుని ముందుచూపుతో వ్యవహరించమని హితవు పలికేదే పంచాంగ శ్రవణం.

సాహిత్యంతో ముడిపడిన పర్వదినాల్లో ఉగాది మొదటిది. కవిసమ్మేళనాలు లేని, అవధానాలను తలచుకోని, కళలను ఆరాధించని ఉగాదిని ఊహించలేం. మానసిక ప్రశాంతతకు, ఉల్లాసానికి తోడ్పడేవే కళలు. వృత్తిగత జీవితానికి వ్యక్తి జీవితానికి సమాంతరంగా సాహిత్యం, కళలు పెనవేసుకుని ఉంటాయని, అలా ఉంటేనే జీవితానికి అర్థమూ పరమార్థమని ఉగాది చెప్పకనే చెబుతుంది.

ఆచారసంప్రదాయాలను, పూర్వుల వైజ్ఞానిక దృష్టిని, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను చాటుతూ భరతజాతిని సమున్నత స్థానంలో నిలబెట్టేది మన పండుగలే. కనుక వాటిని మనం ఆచరిస్తూ పిల్లలు అనుసరించేలా చూస్తూ భారతభూమి సుస్థిరకీర్తికి బద్ధులమై ఎదగాలి. బాధ్యతతో మెలగాలి. మన జ్ఞానసంపద వెలగాలి. విశ్వశ్రేయస్సు కలగాలి.

ఉగాది ఉత్తేజానికీ ఆశావహ దృక్పథానికీ ప్రతీక. ఆకులు రాలిన చెట్లవలె ఆశలను కోల్పోయిన మనుషుల్లో చిగుళ్లు తొడిగి ధైర్యాన్నిస్తుంది. సర్వ శుభాలూ చేకూరుస్తుంది. ఒక్క ఉగాదే కాదు, మన పండుగలన్నీ మానసిక బలాన్ని, వ్యక్తిత్వ వికాసాన్నీ అందించి జీవితాన్ని మరింత సారవంతం చేసేవే.

ABOUT THE AUTHOR

...view details