కర్నాటకలోని పశ్చిమ కనుమల్లో జన్మించిన తుంగ, భద్ర నదులు.. వేర్వేరుగా ప్రవహించి.. కూడ్లి అనే పట్టణంలో.. తుంగభద్రగా ఆవిర్భవించిన అనంతరం కర్నూలు జిల్లాలో ప్రవేశించి.. సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలిసిపోతుంది. కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీరు అందిస్తుంది. నవంబరు 20వ తేదీ మధ్యాహ్నం 01:21 గంటలకు.. బృహస్పతి మకర రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా.. తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమవుతాయి. గతంలో 2008 డిసెంబర్‌లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహా కర్నాటకలో తుంగభద్ర పుష్కరాలు జరిగాయి. అప్పట్లో కర్నూలు జిల్లాలో సుమారు 50 లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
తుంగభద్ర పుష్కరాల నిర్వహణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబరు 20వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటా 21 నిముషాల నుంచి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం అవుతాయని దేవాదాయశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. నవంబరు 20వ తేదీ నుంచి డిసెంబరు 1వ తేదీ వరకూ... 12 రోజుల పాటు పుష్కరాలను నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు దేవదాయశాఖ కార్యదర్శి గిరిజా శంకర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఏడాది అక్టోబరు 11న విశాఖలో జరిగిన దైవజ్ఞ సమ్మేళనంలో తుంగభద్ర పుష్కరాల ముహూర్తాన్ని ఖరారు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. తుంగభద్ర పుష్కరాలకు హాజరయ్యేందుకు ఈ నెల 20న ఉదయం 11 గంటలకు ఏపీ సీఎం జగన్... కర్నూలు వెళ్లనున్నారు. పుష్కరాలను ప్రారంభించి.. అదే రోజు సాయంత్రం 4 గంటలకు విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారని సమాచారం.
కొన్ని నెలలుగా కొవిడ్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ఏపీ కొంత తగ్గుముఖం పట్టినా.. కరోనా రెండోదశ వచ్చే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం అప్రమత్తమైంది. నీటి ద్వారా కరోనా వేగంగా విస్తరించే ప్రమాదం ఉందన్న నిపుణుల సూచనల మేరకు.. నదిలో పుణ్యస్నానాలు నిషేధించింది. కేవలం పూజలు, పిండప్రదానాలకు మాత్రమే అనుమతినిచ్చింది. ఇప్పటికే పుష్కర ఘాట్లు, రహదారులు, ఇతర మౌలిక వసతుల కోసం ప్రభుత్వం రూ.230 కోట్లను కేటాయించింది. పుష్కరాలకు 23 ఘాట్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.