TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి దర్శన టికెట్లపై తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దర్శన టికెట్లు పెంచాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు ఈవో జవహర్ రెడ్డి వెల్లడించారు. ఈనెల 16 నుంచి తిరుపతిలో సర్వదర్శనం టికెట్ల జారీ చేయనున్నట్లు తెలిపారు. కరెంట్ బుకింగ్ ద్వారా రోజుకు 10 వేల టికెట్లు జారీ చేస్తామన్నారు.
తితిదే ప్రాణదాన ట్రస్టుకు కోటి విరాళమిచ్చిన వారికి ఈనెల 16 నుంచి ఉదయాస్తమాన టికెట్లు జారీచేయనున్నట్లు ఈవో తెలిపారు. తితిదే వెబ్‌సైట్ ద్వారా ఉదయాస్తమాన సేవా టికెట్ల బుకింగ్‌కు ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేశామన్నారు. భక్తులు ఆన్‌లైన్ ద్వారా విరాళమిచ్చి ఉదయాస్తమాన సేవ టికెట్ పొందవచ్చునన్నారు.
శ్రీవారి సేవలో గవర్నర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
తిరుమల శ్రీవారిని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. సతీమణితో కలసి తిరుమలేశుని ఆశీస్సులు అందుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కరోనాతో దెబ్బతిన్న పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. జమ్మూలో తితిదే ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించడం సంతోషకరమన్నారు. పంచగవ్య ఉత్పత్తులు, గో రక్షణ చర్యలతో గోమాతపై గౌరవం పెరిగిందని తెలిపారు. అంతకు ముందు తిరుమలలోని పుష్పగిరి మఠం వద్ద జరిగిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలి వివాహ వేడుకలో ఆయన పాల్గొన్నారు.
ఇదీచూడండి:వైభవంగా సహస్రాబ్ది ఉత్సవాలు.. 20 ఆలయాలకు కొనసాగుతున్న ప్రాణప్రతిష్ఠ