ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుల జాబితా రెండు, మూడు రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సభ్యుల సంఖ్య పెంచాలా లేదా పాత సంఖ్యనే కొనసాగించాలా అనే విషయంపై చర్చ జరుగుతోంది. అందువల్లే పేర్లు సిద్ధంగా ఉన్నా జాబితాను ఖరారు చేయలేదని చెబుతున్నారు. గత పాలకమండలిలో మాదిరిగానే ఛైర్మన్ కాకుండా మరో 24 మంది సభ్యులతో జాబితా ఇవ్వొచ్చని... అయితే ఈసారి ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్య 40కు పెంచుతారని.. సభ్యుల సంఖ్యనే 52కు పెంచుతారని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
TTD: రెండు, మూడు రోజుల్లో తితిదే పాలకమండలి జాబితా! - telangana news
తితిదే పాలకమండలి సభ్యుల జాబితా రెండు, మూడు రోజుల్లో ఖరారయ్యే అవకాశముంది. అయితే సభ్యుల సంఖ్య పెంచనున్నారనే ప్రచారం మాత్రం జోరందుకుంది. దీనిపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
తితిదే పాలకమండలి సభ్యుల సంఖ్యను పెంచాలంటే చట్టసవరణ చేయాల్సి ఉంటుంది. ఏపీలో 16న జరిగే మంత్రిమండలిలో ఈ అంశాన్ని చర్చకు పెట్టవచ్చని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతోపాటు మహారాష్ట్ర, దిల్లీల నుంచి ఈసారి తితిదే పాలకమండలిలో సభ్యత్వం కోసం సిఫార్సులు ఎక్కువగా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పాలకమండలి సభ్యులు లేదా ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్య పెంపుపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ చర్చలు జరుపుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి:lord Ganesh visarjan : భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనంపై గందరగోళం