జ్వరం, దగ్గు, జలుబు లాంటి కరోనా లక్షణాలు ఉంటే తిరుమలకు రావొద్దని భక్తులకు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తిరుమలలో టికెట్లు బుక్ చేసుకున్న భక్తుల్లో 15 నుంచి 20 శాతం మంది గైర్హాజరు అవుతున్నారని చెప్పారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తిరుపతిలో ఇస్తున్న శ్రీవారి సర్వదర్శనం టైమ్‌స్లాట్ టికెట్ల కోటాను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. స్థానిక అన్నమయ్య భవనంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.
తిరుపతిలో కొవిడ్ కేసులు దాదాపు 79కి చేరుకున్నాయని, అందులో 10 మంది తితిదే ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. ఈవో కేఎస్.జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కొవిడ్-19పై సమీక్షించి పలు ఆదేశాలను జారీ చేశామన్నారు. బుధవారం నుంచి సర్వదర్శనం టైమ్‌స్లాట్ టోకెన్లను రోజుకు 22 వేల నుంచి 15 వేలకు తగ్గించామన్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఏప్రిల్ కోటా విడుదల చేయగా.. వాటిని భక్తులు 100% బుక్ చేసుకున్నారని, వాటిని రద్దుచేసే పరిస్థితి లేదన్నారు. ఏప్రిల్ 14 నుంచి ఆర్జిత సేవలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్ పరిస్థితిని తితిదే ఛైర్మన్, ఈవో పరిశీలించాకే తదుపరి చర్యలను తీసుకుంటామని వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, గదుల కేటాయింపు వద్ద థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలను ఏర్పాటు చేశామన్నారు.