తితిదే (TTD)అగరబత్తీలను(TTD Incense Sticks) తిరుపతిలోని ఎస్వీ గోశాలలో ఆ సంస్థ ఛైర్మన్ సుబ్బారెడ్డి ప్రారంభించారు. శ్రీవారి ఏడుకొండలకు సూచికగా 7 బ్రాండ్లతో అగరబత్తీలను విక్రయించనున్నట్లు తెలిపారు. అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, సృష్టి, తుష్టి, దృష్టి పేర్లతో.. తితిదే అగరబత్తీలను అందుబాటులోకి తీసుకురానుంది. తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో ఈ బత్తీలను విక్రయించాలని నిర్ణయించింది. తితిదే ఆలయాల్లో వినియోగించిన పుష్పాలతో ఈ బత్తీలను తయారు చేయనున్నారు. ఈ అగరబత్తీల తయారీకి దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థతో తితిదే ఒప్పందం కుదుర్చుకుంది.
ఆలోచనకు పునాది పడింది ఇలా..
తితిదే (TTD) ఆలయాల్లో పూజలు, అలంకరణలకు రోజూ పుష్పాలు వినియోగిస్తున్నారు. పర్వదినాలు, ఉత్సవాల సమయంలో అయితే పుష్పాల వినియోగం మరింత అధికంగా ఉంటుంది. దేవతామూర్తులకు ఉపయోగించిన పుష్పాలన్నీ మరుసటిరోజు ఉదయం తొలగిస్తారు. దీంతో స్వామివారి సేవకు వినియోగించిన ఈ పుష్పాలు వృథా కాకుండా తిరిగి ఉపయోగించే విషయంపై తితిదే బోర్డు వినూత్న ఆలోచన చేసింది. ఈ క్రమంలో బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ తితిదే ఆలయాల్లో రోజువారీగా వినియోగించిన పుష్పాలను అందిస్తే లాభంతో సంబంధంలేకుండా అగరబత్తులు తయారుచేసేందుకు ముందుకొచ్చింది. దీంతో ఆ సంస్థతో తితిదే అవగాహన కుదుర్చుకొని ఎస్వీ గోశాలలో అగరబత్తుల తయారీకి అవసరమైన స్థలం కేటాయించింది. దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ సొంత ఖర్చుతో యంత్రాలు, సిబ్బందిని నియమించుకుని కొన్ని రోజులుగా ప్రయోగాత్మకంగా అగరబత్తుల ఉత్పత్తిని ప్రారంభించింది.