తెలంగాణ

telangana

ETV Bharat / city

'చట్టవిరుద్ధమా కాదా అని తేల్చేది కార్మిక న్యాయస్థానమే' - తెలంగాణ ఆర్టీసీ సమ్మె

ఆర్టీసీ సమ్మెపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని లేబర్‌ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. కార్మిక న్యాయస్థానానికి వెళ్లాలా, లేదా అని రెండు వారాల్లోగా నిర్ణయించాలని సూచించింది. సమ్మె చట్టబద్ధమా కాదా అని నిర్ణయించే అధికారం కార్మిక న్యాయస్థానానికే ఉందని ధర్మాసనం పేర్కొంది. చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని స్పష్టం చేసింది.

tsrtc strike

By

Published : Nov 18, 2019, 8:51 PM IST

'చట్టవిరుద్ధమా కాదా అని తేల్చేది కార్మిక న్యాయస్థానమే'

ఆర్టీసీ సమ్మె, రూట్ల పర్మిట్లపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. సమ్మె చట్ట విరుద్ధమని ధర్మాసనం ముందు అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌ రావు వాదించారు. సమ్మెకు వెళ్లే ముందు కార్మికులు నోటీస్ ఇవ్వలేదని పేర్కొన్నారు. నోటీస్ ఇచ్చిన తర్వాత కనీసం ఆరు వారాలు ఆర్టీసీ నిర్ణయం కోసం ఎదురుచూడాలని వివరించారు. కార్మికులు చట్టప్రకారం నడుచుకొలేదని వాదించారు. స్పందించిన ధర్మాసనం సమ్మెవిరుద్ధమని చెప్పే హక్కు కార్మిక న్యాయస్థానానికి మాత్రమే ఉందని పేర్కొంది.

ఇదీ చూడండి: రేపటి సడక్​ బంద్​ వాయిదా: అశ్వత్థామరెడ్డి

మాకు పరిమితులున్నాయి

కార్మిక సమస్యలపై స్పందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టుకు ఆర్టీసీ ఐకాస తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ దాఖలు చేసిన అఫిడవిట్‌ ప్రభుత్వానికి మద్దతిచ్చేలా ఉందని చెప్పారు. డిమాండ్లు పరిష్కరిస్తే కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్మికులందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని... వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ధర్మాసనం... ప్రభుత్వం కమిటీ వేసేందుకు సిద్ధంగా లేదని పేర్కొంది. సర్కారును ఆదేశించే విషయంలో తమకు కొన్ని పరిమితులు ఉన్నాయని తెలిపింది. ఆ పరిమితులు దాటి ముందుకు పోలేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఒత్తిడి చేయలేం

సమ్మె వ్యవహారాన్ని కార్మిక కమిషనర్‌ ముందుంచింది హైకోర్టు. ఆర్టీసీ సమ్మెపై రెండువారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని లేబర్‌ కమిషనర్‌ను ఆదేశించింది. కార్మిక న్యాయస్థానానికి వెళ్లాలా, లేదా అని రెండు వారాల్లోగా నిర్ణయించాలని పేర్కొంది. చర్చలు జరపాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేలేమని... చర్చలు స్వచ్ఛందంగా, సామరస్యంగా జరగాలని ఆకాంక్షించింది. ఒత్తిడి చేయడం వల్ల చర్చలు జరగవని... సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: 'ఆర్టీసీ సమ్మెపై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details