Vajra AC buses: వజ్ర ఏసీ బస్సులను హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో హైదరాబాద్ నుంచి వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ వంటి దూర ప్రాంతాలకు వజ్ర బస్సులు నడిచేవి. ఇప్పుడు వాటిని ఐటీ కారిడార్‌లో నడుపుతున్నారు. జేఎన్‌టీయూ నుంచి వేవ్‌రాక్ వరకు వయా సైబర్ టవర్స్, మైండ్ స్పేస్, బయో డైవర్సిటీ, గచ్చిబౌలీ మీదుగా తిప్పుతున్నారు. ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని డీఎల్ఎఫ్, ఇన్ఫోసిస్, విప్రో, ఐసీఐసీఐ, అమెజాన్ వంటి కంపెనీలకు... సులువుగా చేరుకునేందుకు వజ్ర బస్సులను వినియోగిస్తున్నారు.
మళ్లీ రాకపోకలు పెరగడంతో...
హైటెక్ సిటీ సహా ఐటీ దిగ్గజ సంస్థల నుంచి సమీపంలోని మెట్రో స్టేషన్‌లకు, ప్రధాన ప్రాంతాలకు చేరుకొనేలా వజ్ర బస్సులు అందుబాటులో తెచ్చినట్లు ఆర్టీసీ తెలిపింది. కొవిడ్ సమయంలో ఈ ప్రాంతాల్లో రవాణా కార్యకలాపాలు తగ్గిపోయాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం ఐటీ సంస్థల కార్యకలాపాలను తిరిగి పునరుద్ధరించాయి. మళ్లీ రాకపోకలు పెరిగాయి. ఈ క్రమంలో క్యాబ్‌లు, ఆటోలు, ప్రైవేటు వాహనాల నుంచి ఎదురయ్యే పోటీని ఎదుర్కొనేందుకు... ఆర్టీసీ ప్రస్తుతం వజ్ర మినీ ఏసీ బస్సులను ఈ మార్గంలో నడిపిస్తోంది.