RTC Bumper Offers: విమానాశ్రయానికి వెళ్లి, వచ్చే ప్రయాణికులకు ఆర్టీసీ సంస్థ శుభవార్తను మోసుకొచ్చింది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లి వచ్చేందుకు పుష్పక్ బస్సులలో ప్రయాణించే వారికి గ్రేటర్ ఆర్టీసీ హైదరాబాద్ జోన్ మూడు గంటలపాటు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అద్భుత అవకాశాన్ని కల్పించింది. విమానాశ్రయం నుంచి పుష్పక్ బస్సులలో ప్రయాణించిన టికెట్ చూపించి.. తమ నివాస ప్రదేశం చేరేందుకు టికెట్ ఖరీదు చేసిన మూడు గంటల వరకు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ తెలియజేసింది. ఈ సౌకర్యాన్ని పుష్పక్ ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది.
మరోవైపు.. కార్గో, పార్శిల్ సేవల ద్వారా వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ఆర్టీసీ అన్ని రకాల ప్రయాత్నాలు చేస్తోంది. ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవలను విస్తరించాలని యాజమాన్యం నిర్ణయించింది. పికప్, హోం డెలివరీ సేవలను ప్రారంభించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేశారు. "వేగంగా.. భద్రంగా.. చేరువగా.." అనే లక్ష్యంతో ఈ సేవల్ని ప్రారంభించిన ఆర్టీసీ అనతి కాలంలోనే ప్రయాణికుల ఆదరణను చూరగొంది. 177 బస్‌స్టేసన్లతో పాటు అధీకృత ఏజెంట్ల ద్వారా కొనసాగిస్తున్న పార్శిల్ సేవలు.. బుకింగ్, డెలివరీ పాయింట్ల నుంచే కాకుండా నేరుగా వినియోగదారుల ఇంటి వద్దకే ఈ సేవల్ని అందించే దిశలో ప్రతిపాదనల్ని రూపొందించింది.
మొదటి, చివరి మైల్ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకురావడానికి భాగస్వాములను ఆహ్వానిస్తోందని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ సజ్జనార్ తెలిపారు. 11 రీజియన్లు, 97 బస్ డిపోలతో విస్తృత నెట్‌వర్క్ కలిగి ఉన్న టీఎస్ఆర్టీసీ వినియోగదారుల చెంతకే.. అంటే హోమ్ డెలివరీ, హోం పికప్ సదుపాయాల్ని ప్రారంభించాలని ఆలోచన చేస్తుందన్నారు. ప్రజా రవాణా సేవల్లో భాగంగా నడుపుతున్న బస్సుల ద్వారా పార్శిల్స్ పాయింట్ నుంచి డెలివరీ పాయింట్ వరకు చేరవేయనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలతో పాటు కొన్ని రీజియన్లలో మాత్రమే హోం డెలివరీ సేవలు కొనసాగుతున్నాయని ఆర్టీసీ ఛైర్మన్, ఎండీ తెలిపారు. వినియోగదారులకు మరింత సౌకర్యం కల్పించేందుకు హోం పికప్‌తో పాటు అన్ని జిల్లాలలోనూ హోం డెలివరీ సేవల్ని త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నామన్నారు. ఈ సేవల్ని అందించేందుకు భాగస్వాములను ఆహ్వానిస్తున్నామన్నారు.
టీఎస్ఆర్టీసీతో చేతులు కలుపడానికి ఆసక్తి ఉన్న వారు ఎవరైనా ముందుకు రావొచ్చని యాజమాన్యం కోరింది. ఆర్థిక సామర్థ్యాలతో పాటు వారి బిజినెస్ వివరాలను splofficertsrtc@gmail.com మెయిల్‌కు పంపాలని సూచించింది. మరింత సమాచారం కోసం.. కార్గో అండ్ పార్శిల్ విభాగం అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఫోన్ నంబర్ 9154197752 సంప్రదించాలన్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 27 లోపు బస్‌భవన్ 3వ అంతస్తులో సంప్రదించవచ్చని తెలియజేశారు.
ఇవీ చూడండి: