తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె పరిష్కారం దిశగా కాకుండా... సంక్షోభం దిశగా సాగుతోంది. చర్చలు జరపాలని హైకోర్టు చెబుతున్నా ఆ వాతావరణం కనిపించడం లేదు. ప్రభుత్వానికి, కార్మిక సంఘాల మధ్యలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిరసనలు, అరెస్టులు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోని డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రోడ్లపై బైఠాయించి ఎక్కడికక్కడ బస్సులను అడ్డుకున్నారు.పలుచోట్ల రాజకీయ పార్టీలతో కలిసి కార్మికులు ధర్నాలు నిర్వహించారు.
నాదే చివరి బలిదానం..!
హైకోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందోనని మనస్తాపానికి గురైన ఓ డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నరేష్ 2007 నుంచి ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. భార్య ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతోంది. మందులకు నెలకు సుమారు రూ.5 వేలు ఖర్చవుతున్నాయనీ.. పిల్లల చదువుతో నరేశ్ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు తోటి ఉద్యోగులు తెలిపారు.
"తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఆర్టీసీ కార్మికులను సీఎం కేసీఆర్ డిస్మిస్ అనడం బాధాకరం. నా చావుకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి కారణం. నా కుటుంబం పడే ఇబ్బంది మరో ఆర్టీసీ కార్మికుడి కుటుంబం పడొద్దని సీఎంకు విన్నవించుకుంటున్నా. ఆర్టీసీలో చివరి బలిదానం నాదే కావాలి.. ఇక సెలవు" - మృతుడు నరేశ్ లేఖ
ఇంకా ఎన్ని బతుకులు ఆగం కావాలె: ఆర్టీసీ ఐకాస
ఆత్మహత్యకు పాల్పడిన డ్రైవర్ నరేష్ అంత్యక్రియలకు వెళ్తున్న ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని జనగామ జిల్లా పెంబర్తి వద్ద పోలీసుసు అడ్డుకున్నారు. తమ నాయకుడు రానిదే అంత్యక్రియలు జరుపమని పట్టు పట్టడం వల్ల పోలీసులు వదిలేశారు.
కమిటీ ఎందుకు వద్దో చెప్పండి..?
ఆర్టీసీ కార్మికులు రాయాల్సింది సూసైడ్ నోట్‌లు కాదు.. తెరాస పాలనకు మరణ శాసనం రాయాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ నరేశ్ మృతి పట్ల సంతాపం తెలిపారు. సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తులతో కమిటీ వేస్తామంటే ఎందుకు వద్దంటున్నారో తెలియడం లేదన్నారు.
సీఎంగారు మీ నిర్ణయం మార్చుకోండి: భట్టి
ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. 40 రోజులుగా బస్సులు నిలచిపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే దానిని ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.
మౌనం పరిష్కారం చూపదు..
సీఎం కేసీఆర్‌పై తెలంగాణ మజ్దూర్ యూనియన్ కార్మిక సంఘం నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సమ్మె విషయంలో మేధావుల మౌనం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.
ఆర్టీసీ సమ్మె - అట్టుడుకుతున్న రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు - ధర్నాలు
- కరీంనగర్ శివారులోని తీగలగుట్టపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా వామపక్ష, విద్యార్థి సంఘాల నాయకులు కేసీఆర్ ఇంటిని ముట్టడించేందుకు తరలివస్తుండగా పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. సీఎం ఇంటివైపు దూసుకెళ్లేందుకు యత్నించిన విద్యార్థులను బలవంతంగా వాహనాల్లో స్టేషన్‌కు తరలించారు.
- ఆసిఫాబాద్ డిపో ప్రవేశ ద్వారం వద్ద ఆర్టీసీ కార్మికులు, విద్యార్థి సంఘాలు, సీపీఐ, సీపీఎం, భాజపా, కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ముందస్తు సమాచారంతో ప్రవేశ ద్వారం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకున్నారు.
- నిజామాబాద్ జిల్లా బోధన్‌లో దీక్ష చేస్తున్న కార్మికులకు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంత రావు మద్దతు తెలిపారు. 40 రోజులు కాదు 400 రోజులైనా సరే.. పరిష్కారం అయ్యేవరకు సమ్మె కొనసాగిస్తారన్నారు.
- యాదాద్రిలో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు భిక్షాటన చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. బస్ స్టాప్ ఆవరణలో భక్తులకు కొబ్బరి కాయలు, సీత ఫలాలు అమ్మి వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు.
"తెగేదాకా లాగేందుకే అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసీ కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని హైకోర్టు పదే పదే విఙ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రోజురోజుకు సమస్య జఠిలం అవుతుందే తప్ప పరిష్కార మార్గం కనిపించడం లేదు"