జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెరాస నేతలు తిప్పికొట్టారు. బూటకపు మాటలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయవద్దన్నారు. ఏడేళ్లలో భాజపా ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమిటో చెప్పాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. కిషన్రెడ్డి కేంద్ర మంత్రి అయ్యాక వరంగల్ జిల్లాకు, రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలన్నారు. భాజపా అంటేనే మోసాలు చేసి.. మభ్యపెట్టి.. రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చే పార్టీ అని ప్రజల్లో తేలిపోయిందని మంత్రి ఎర్రబెల్లి ధ్వజమెత్తారు.
పేదలపై భారం నిజంకాదా..?
అన్ని పథకాల నిధుల్లో కేంద్ర భాగస్వామ్యం ఉందని చెప్పుకోవడం పద్ధతి కాదని ఎర్రబెల్లి సూచించారు. చెల్లించిన పన్నుల్లో వాటా రాష్ట్రాల హక్కని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా హుందాగా ప్రవర్తించాలని ఎర్రబెల్లి సూచించారు. తెలంగాణలో కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా.. ప్రజలపై భారం మోపలేదని.. కేంద్రం మాత్రం.. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్పై ధరలు పెంచి పేదలపై భారం వేసింది నిజం కాదా అని మంత్రి ప్రశ్నించారు. ఏపీ విభజన చట్టం ప్రకారం దక్కాల్సిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య విధానాల వల్లే కరోనాతో అనేక మంది మరణించారని ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.
తెలంగాణకు ఏం చేస్తారో చెప్పండి..