తెలంగాణ

telangana

ETV Bharat / city

వరద బాధితులకు ప్రభుత్వం అండ.. రూ.550 కోట్లు విడుదల - flood compensation of ts govt

హైదరాబాద్‌లో వందేళ్లలో లేని భారీ వర్షాలతో అతలాకుతలమైన ప్రజలకు ప్రభుత్వం అండగా నిలిచింది. పేదలకు సాయం అందించేందుకు పురపాలకశాఖకు రూ.550కోట్లు విడుదలచేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ రూ.10వేలు సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. పేదలను ఆదుకునేందుకు పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

వరద బాధితులకు ప్రభుత్వం అండ.. రూ.550 కోట్లు విడుదల
వరద బాధితులకు ప్రభుత్వం అండ.. రూ.550 కోట్లు విడుదల

By

Published : Oct 19, 2020, 8:34 PM IST

వరద బాధితులకు ప్రభుత్వం అండ.. రూ.550 కోట్లు విడుదల

వందేళ్లలో ఎన్నడూలేని వర్షంతో అతలాకుతలమైన హైదరాబాద్‌ ప్రజలకు ముఖ్యమంత్రి ఆపన్నహస్తం అందించారు. వర్షాలతో ఇబ్బందులకు గురైన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు పురపాలకశాఖకు రూ.550కోట్ల తక్షణమే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ రూ.10వేల సాయం.. రేపట్నుంచే అందిస్తామని తెలిపారు. వర్షాల కారణంగా పూర్తిగా ఇళ్లు కోల్పోయిన వారికి రూ.లక్ష చొప్పున, పాక్షికంగా ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.50వేల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించారు. 200నుంచి 250 బృందాలు ఏర్పాటుచేసి ఆర్థికసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న రహదార్లు, ఇతర మౌలికవసతులను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి.. మామూలు పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాల కలెక్టర్లు, వారి బృందాలు వెంటనే రంగంలోకి దిగాలని సూచించారు. నష్టపోయిన ప్రజలు లక్షమందైనా సాయమందిస్తామన్న కేసీఆర్‌.. ప్రజాప్రతినిధులు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఉదారత చాటాలి..

భారీవర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఉదారత చాటాలని కోరారు. సీఎం సహాయనిధికి విరివిగా విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రాష్ట్రానికి తమిళనాడు ప్రభుత్వం రూ.పది కోట్లు ఆర్థికసాయాన్ని ప్రకటించింది. ఆర్థికసాయంతో పాటు పెద్దసంఖ్యలో దుప్పట్లు, చద్దర్లు పంపుతున్నట్లు ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి ప్రకటించారు. ఇంకా అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడు ప్రభుత్వం, ప్రజలకు సీఎం కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

మఖ్యమంత్రి పిలుపుమేరకు పారిశ్రామికవేత్తలు విరాళాలు అందిస్తున్నారు. మేఘా ఇంజినీరింగ్ సంస్థ సీఎం సహాయనిధికి 10కోట్ల రూపాయల ఆర్థికసాయం ప్రకటించింది.

ఇవీ చూడండి:గ్రేటర్​ పరిధిలోనే 33 మంది మృతి: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details