వంద శాతం జీఎస్టీ పరిహారం చెల్లించాల్సిందేనని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. జీఎస్టీ పరిహారం చెల్లింపు విషయంలో అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. జీఎస్టీ పరిహారం చెల్లింపు విషయంలో సీఎం కేసీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాసినట్లు తెలిపారు.
రూ.లక్షా 35 వేల కోట్ల పరిహారాన్ని.. కేంద్రం ఇవ్వటం లేదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కేంద్రం.. రాష్ట్రాలకు పూర్తిస్థాయి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అందులో ఎలాంటి షరతులు లేకుండా చూడాలని కోరారు.
కొవిడ్‌తో రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయన్న హరీశ్‌రావు.. నాలుగు నెలల్లో రాష్ట్రం రూ.8వేల కోట్లను కోల్పోయిందని వెల్లడించారు. జీఎస్టీలో చేరే విషయమై.. అప్పుడే అనుమానం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.
దేశ ప్రయోజనాలు, పన్నుల సరళి దృష్ట్యా జీఎస్టీలో చేరాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. జీఎస్టీలో చేరకుంటే రాష్ట్రానికి అదనంగా రూ.25 వేల కోట్ల ఆదాయం వచ్చేదని తెలిపారు.
యూపీఏ హయాంలోనూ రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్న హరీశ్‌రావు.. కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రాలకు చట్టబద్ధంగా వచ్చే నిధులను ఇవ్వకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. ఎఫ్‌ఆర్‌బీఎంలో రాష్ట్రానికి నామమాత్రం అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
కేంద్రం పెద్దమనిషి తరహాలో జీఎస్టీ పరిహారం చెల్లించేందుకు ముందుకు రావాలని హరీశ్‌రావు కోరారు.
ఇవీచూడండి:అసలా.. వడ్డీయా..? రెండు ఐచ్ఛికాలపై కేంద్రం స్పష్టత