గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తెరాస ప్రచారం నేటి నుంచి ముమ్మరం కానుంది. డివిజన్ ఇంఛార్జిలుగా వ్యవహరిస్తున్న మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే ప్రచారం కొనసాగిస్తున్నారు. నామినేషన్లు దాఖలు ముగియడంతో.. ఇవాళ్టి నుంచి పూర్తిస్థాయి ప్రచారానికి వ్యూహాలు సిద్ధం చేశారు. నేటి నుంచి కేటీఆర్ నగరంలో విస్తృత పర్యటనకోసం ప్రత్యేక ప్రచార రథాలను తీర్చిదిద్దారు. ఒక్కో నియోజకవర్గంలో 2చోట్ల ప్రసంగించాలని భావిస్తున్నారు.
కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని డివిజన్ల నుంచి మంత్రి ప్రచారం ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి ఓల్డ్‌అల్లాపూర్ చౌరస్తా... 6 గంటలకు మూసాపేటలోని చిత్తారమ్మ తల్లి చౌరస్తాలో ప్రచారం చేయనున్నారు. తర్వాత కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 8 డివిజన్లు ఉండగా.. 4 డివిజన్లకు ఒక చోట కేటీఆర్ సభ ఉండేలా ఏర్పాట్లు చేశారు. రాత్రి 7గంటలకు ఐడీపీఎస్ చౌరస్తా, 8 గంటలకు సాగర్ హోటల్ జంక్షన్ వద్ద సభలు నిర్వహిస్తారు. ఈ నెల 29న ప్రచారం ముగిసే వరకూ ఇదే విధంగా రోడ్ షోలు నిర్వహించనున్నారు.