తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉద్యోగాల భర్తీపై ఏ చర్చకైనా సిద్ధం... కేటీఆర్ సవాల్​ - కేటీఆర్ వార్తలు

ఆరున్నరేళ్లలో 1,32,799 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని.. దీనిపై ఏ చర్చకైనా సిద్ధమని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ సవాల్ విసిరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపాకు ఓటడిగే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ న్యాయం చేస్తారన్న నమ్మకం ఉద్యోగులకు ఉన్నదని.. మొసలి కన్నీళ్లు కార్చే అవసరం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. జీడీపీ పెంచుతామని మోదీ ప్రభుత్వం అంటే ఏమో అనుకున్నానని.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ పెంచిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

KTR
KTR

By

Published : Feb 24, 2021, 9:18 PM IST

ఉద్యోగాల భర్తీపై ఏ చర్చకైనా సిద్ధం... కేటీఆర్ సవాల్​

ఆరున్నరేళ్లలో తెరాస సర్కారు 1,32,799 ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ రంగంలో 14 లక్షల ప్రత్యక్ష ఉపాధి కల్పించిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సుమారు 36వేల ఉద్యోగాలు టీఎస్​పీఎస్సీ ద్వారా మిగతావి పోలీసు, విద్య, విద్యుత్, పంచాయతీరాజ్ తదితర శాఖల ద్వారా నియామకాలు చేపట్టామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు 42 వేల ఉద్యోగాలిచ్చారని.. అందులో తెలంగాణకు దక్కింది దాదాపు పదివేలు మాత్రమేనన్నారు. తాము చెప్పేది అబద్ధమయితే ఏ చర్చకైనా సిద్ధమని కేటీఆర్ సవాల్ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణ భవన్​లో కేటీఆర్ సమావేశమయ్యారు.

ఏకైక రాష్ట్రం తెలంగాణ

హోంగార్డులు, అంగన్ వాడీ, ఆశా, పారిశుద్ధ్య సిబ్బందికి వేతనాలు పెంచింది కూడా తమ సర్కారేనని కేటీఆర్ పేర్కొన్నారు. న్యాయవాదులకు, జర్నలిస్టులకు మూలనిధిని ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఉద్యోగులకు అత్యధికంగా 42శాతం ఫిట్​మెంట్ ఇచ్చినట్లు కేటీఆర్ వివరించారు. జోనల్ సమస్యలు, విభజన చిక్కులు ఇంకా తేలకపోయినప్పటికీ వీటన్నింటినీ చేశామని.. ఇంకా చేయాల్సింది ఉందన్నారు.

అనుమానం అవసరం లేదు

ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయం చేస్తారన్న నమ్మకం ఉద్యోగులకు ఉంది. ఉద్యోగులపై మొసలి కన్నీళ్లు కార్చి, తాత్కాలిక ప్రేమ చూపాల్సి అవసరం లేదు. రెండో పీఆర్సీపై చర్చలు జరుగుతున్నాయి. కచ్చితంగా ఇస్తాం. మాది ఉద్యోగుల స్నేహపూర్వక సర్కారు. చిన్న చిన్న సమస్యలున్నా పరిష్కరిస్తాం. కేసీఆర్ నిబద్ధతపై ఎలాంటి అనుమానం అవసరం లేదు. ఉద్యమ కాలం నుంచి ఉద్యోగులతో కలిసి పనిచేస్తున్నాం. భాజపా, కాంగ్రెస్ కన్నా మాకే వారితో ఎక్కువ సన్నిహిత సంబంధాలున్నాయి.

-కేటీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు

ఐటీఐఆర్ రద్దు చేసి...

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపాకు ఎందుకు ఓటేయాలని ఆ పార్టీ నేతలు, అభ్యర్థులు చెప్పాలని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఎన్.రామచంద్రరావు ఆరేళ్లలో పట్టభద్రులకు ఏం చేశారో చెప్పాలన్నారు. కేంద్రంలో అధికారం ఉన్నప్పటికీ.. రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించడం ఒక్కటే సరిపోదని.. పనిచేయడం కూడా ముఖ్యమన్నారు. మత రాజకీయాలు కాదని.. జనహితం కావాలన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని.. ఏమయ్యాయన్నారు. కేంద్రం పునర్విభజన హామీలు అమలు చేయలేదని.. ఐటీఐఆర్ రద్దు చేసి వేలాది ఉద్యోగాలు రాకుండా చేసిందని కేటీఆర్ మండిపడ్డారు.

విజయం సాధిస్తాం

జీడీపీ పెంచుతామన్న ఎన్డీయే సర్కారు.. గ్యాస్, డీజిల్, పెట్రోలు పెంచిందని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా 157 వైద్యకాలేజీలు మంజూరు చేసిన కేంద్రం.. తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. జీహెచ్ఎంసీలో తాము ఓడిపోయామనుకోవడం లేదని.. అతిపెద్ద పార్టీగా ప్రజలు తెరాసనే నిలిపారని.. మేయర్, ఉపమేయర్ తమకే దక్కాయన్నారు. సురభి వాణిదేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కచ్చితంగా విజయం సాధిస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అన్ని కోణాల్లో ఆలోచించే పీవీ నర్సింహారావు కుమార్తె సురభి వాణీదేవిని అభ్యర్థిగా నిలిపారన్నారు. వాణీదేవిని రాజ్యసభకో, శాసనమండలికో ఎందుకు పంపలేదని ప్రతిపక్షాలు అంటున్నాయని.. ఆమె ఉన్నతపదవికి అర్హురాలని గుర్తించి గౌరవించడం ఆహ్వానించదగిన విషయమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. విద్యావేత్తగా, విజ్ఞానవంతురాలిగా వాణిదేవి పట్టభద్రుల ఓటుకు అర్హురాలన్నారు.

పీవీ గుణాలు ఆమెలో ఉన్నాయి

సురభి వాణీ దేవి గొప్ప మహిళ అని.. పీవీ గుణాలు ఆమెలో ఉన్నాయని తెరాస సెక్రటరీ జనరల్ కె.కేశవరావు పేర్కొన్నారు. తెరాస బలాలతోనే ప్రజల్లోకి వెళ్తామని.. విపక్షాల మాదిరిగా అనవసర విమర్శలు చేయమన్నారు. పీవీ నర్సింహారావు ఆశ్రమానికి వెళ్తామనుకున్న సమయంలో ప్రధాని పదవి వచ్చినట్లు.. తనకు ఇప్పుడు ఈ అవకాశం వచ్చిందని సురభి వాణీదేవి పేర్కొన్నారు. తమకు చిన్నప్పటి నుంచి ప్రజాసేవను పీవీ నర్సింహారావు నూరిపోశారన్నారు. విద్యా సంస్థల నిర్వాహకురాలిగా పట్టభద్రుల అంశాలన్నీ చూశానని.. తనకు ఓటేస్తే ప్రభుత్వంతో కలిసి పరిష్కరిస్తానన్నారు.

ఆషామాషీగా తీసుకోవద్దు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని కేటీఆర్​ అన్నారు. సురభి వాణీదేవి విజయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించాలని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో చేసిన పొరపాట్లను చేయవద్దని ఎమ్మెల్యేలను హెచ్చరించారు. శనివారం ప్రతీ నియోజకవర్గంలో తెరాస సర్వసభ్య సమావేశం నిర్వహించి... ఎన్నికల ప్రత్యక్ష ప్రచారంలోకి దిగాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

ఇదీ చదవండి:పట్టభద్రుల ఎమ్మెల్సీ నామపత్రాల పరిశీలన పూర్తి

ABOUT THE AUTHOR

...view details