సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచే సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి(siddipet collector venkatram reddy) మరోసారి సంచలనం సృష్టించారు. సోమవారం ఉదయం నేరుగా బీఆర్కే భవన్‌కు వెళ్లి సీఎస్ సోమేశ్‌కుమార్‌కు తన రాజీనామా(siddipet collector resigns) సమర్పించారు. తన రాజీనామాకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాతే సీఎస్ కార్యాలయం నుంటి బయటకు వచ్చారు.
కేసీఆర్ స్ఫూర్తితోనే..
సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెంకట్రామి రెడ్డి ప్రకటించారు. రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టేలా తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు తనను ఆకర్షించాయని ఆయన స్పష్టం చేశారు. తన సేవలు కేవలం ఒక జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తానికి అందించాలన్న ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా(siddipet collector resigns) చేసినట్లు ఆయన తెలిపారు.
సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి రెవెన్యూ మంత్రిగా అవకాశం..!
ఉద్యోగానికి రాజీనామ చేసిన వెంకట్రామి రెడ్డి త్వరలో తెరాస తీర్థం(venkatram reddy joining in trs) పుచ్చుకోనున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ ప్రకటన లాంఛనప్రాయమే. స్థానిక సంస్థల కోటాలో మండలిలో అడుగు పెట్టనున్నారు. తన సొంత జిల్లా కరీంనగర్ నుంచి లేదా మెదక్ జిల్లా నుంచి పోటీలో నిలిచే అవకాశం ఉంది. వివిధ కీలక విభాగాల్లో విశేషమైన అనుభవం ఉన్న వెంకట్రామి రెడ్డికి ప్రభుత్వంలో కీలక స్థానం లభించే అవకాశం ఉంది. రెవెన్యూ శాఖలో సంస్కరణలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న కేసీఆర్ వెంకట్రామి రెడ్డికి రెవెన్యూ మంత్రిగా అవకాశం ఇస్తారన్న ప్రచారం సాగుతోంది.
కేసీఆరే స్వయంగా కూర్చోబెట్టారు..
పెద్దపల్లి జిల్లా ఇందుర్తి గ్రామానికి చెందిన వెంకట్రామి రెడ్డి(venkatram reddy ias profile) 1996లో గ్రూప్-1 అధికారిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. బందర్, చిత్తూర్, తిరుపతిల్లో ఆర్డీవో గా విధులు నిర్వర్తించారు. హుడా సెక్రటరీగా, మౌళీకవసతుల కల్పన సంస్థ, గృహ నిర్మాణ సంస్థలకు ఎండీగా సైతం సేవలు అందించారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో వెంకట్రామిరెడ్డికి సుధీర్ఘ అనుబంధం ఉంది. డ్వామా పీడీగా, ఉమ్మడి మెదక్ జిల్లా సంయుక్త కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. సిద్దిపేట జిల్లా మొదటి కలెక్టర్ గా ఈయనే బాధ్యలు చేపట్టారు. జిల్లాను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వెంకట్రామిరెడ్డిని కలెక్టర్ కూర్చిలో కూర్చోబెట్టారు. స్వల్ప కాలం సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాలకు కలెక్టర్ గా సేవలందించారు. 2018సాధారణ ఎన్నికల సమయలో సిరిసిల్లకు, దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో సంగారెడ్డి కలెక్టర్ గా అతి తక్కవ సమయం పని చేశారు.
అభివృద్ధిలో అన్నీ తానై..
సిద్దిపేట జిల్లా అభివృద్ధిలో వెంకట్రామి రెడ్డిది కీలక పాత్ర. ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా మంత్రి హరీశ్ రావు ఆలోచనలు, ఆదేశాలను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి ఆవిశ్రాంతంగా కృషి చేశారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటల పునర్నిర్మాణ బాధ్యత ఈయనే భుజాలకెత్తుకున్నారు. గడువు లోపల దేశానికే ఆదర్శంగా ఈ గ్రామాలను నిర్మించడానికి అన్నీ తానయ్యాడు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారు. స్థానికుల నుంచి వ్యతిరేఖత ఉన్నా.. ప్రాజెక్టుల కోసం భూసేకరణ పూర్తి చేసి ముఖ్యమంత్రి మెప్పు పొందారు. దేశంలోనే అతి పెద్ద పునరావాస కాలనీని అన్నీ రకాల సౌకర్యాలు, హంగులతో నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రాజెక్టులు, పునరావాస కాలనీల నిర్మాణాల పర్యవేక్షణకు ఎకంగా వాటికి సమీపంలోనే క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి విధులు నిర్వర్తించారు. ధరణి పోర్టల్ బాలారిష్టాలు దాటడంలోనూ తన వంతు పాత్ర పోషించారు. క్షేత్ర స్థాయిలో రైతులు ఎదుర్కోంటున్న సమస్యలపై ప్రత్యేకంగా సర్వే చేయించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంతో పాటు పరిష్కారాలను సూచించారు. ఎంత పని ఒత్తిడి ఉన్నా.. ప్రజలకు అందుబాటులో ఉండే వారు. కరోనాతో పాటు ఇతర కారణాలతో అనేక జిల్లాల్లో ప్రజావాణిని రద్దు చేస్తే.. వెంకట్రామి రెడ్డి మాత్రం ప్రతి సోమవారం తనే స్వయంగా ప్రజావాణిలో పాల్గోని ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేవారు.
రౌడీ కలెక్టర్.. పని రాక్షసుడు..
ఎంతటి క్లిష్టమైన పనినైనా గడువులోపు చేయడం వెంకట్రామి రెడ్డి ప్రత్యేకత. భూసేకరణ సమస్యలు, పరిహారం, ధరణి సమస్య పరిష్కారం కోసం తెల్లవారు జాము 3గంటల వరకు పని చేసిన రోజులు అనేకం. తన కింది ఉద్యోగులను సైతం గడువులోపే పని పూర్తి చేసేలా వత్తిడి చేసే వారు. ఇందుకోసం సామ దాన దండోపాయాలు ఉపయోగించే వారు. పని విషయంలో ఎంత కఠినంగా ఉంటారో.. ఉద్యోగుల సంక్షేమం విషయంలో అంత సున్నింతగా ఉంటారు. వారి మంచి చెడు తెలుసుకుంటూ.. పెద్ద అన్నలా అండగా నిలిచే వాడు. వెంకట్రామి రెడ్డిని ఉద్యోగులు ప్రేమగా రౌడీ కలెక్టర్.. పని రాక్షసుడు అని పిలుచుకుంటారు. వెంకట్రామి రెడ్డి కార్యదక్షత గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక బహిరంగ సభల్లో మెచ్చుకున్నారు.
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్..
వెంకట్రామి రెడ్డి తరచూ సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచేవారు. మల్లన్న సాగర్ నిర్వాసితులను గ్రామాలను ఖాళీ చేయించడంలో కఠినంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో కోర్టు కేసులు ఎదుర్కోన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి కాళ్లు మొక్కడం చర్చనీయాంశమైంది. ఇటీవల వరి విత్తనం అమ్మితే చర్యలు తీసుకుంటానని అనడం రాజకీయ రచ్చకు దారితీసింది.
ఎన్నో ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా..!
వెంకట్రామి రెడ్డి మొదటి నుంచి తెరాసకు అనుకూలురన్న ప్రచారం ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్ చెరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని.. 2019పార్లమెంటు ఎన్నికల్లో మల్కజ్ గిరి నుంచి బరిలో దిగుతారన్న ప్రచారం సాగింది. దుబ్బాక ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి అన్న అంశం చాలా రోజులు పతాక శీర్షికన నిలిచింది. వచ్చే ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యేగా లేదా మెదక్ ఎంపీగా కేసీఆర్ అవకాశం ఇస్తారన్న ఉహాగానాలు సైతం సాగాయి. తాజాగా గత కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ పదవి హమీ వచ్చిందన్న ప్రచారం సాగింది.
వెంకట్రామి రెడ్డికి వ్యాపార అనుభవం సైతం ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ రాజపుష్ప వీరి కుటుంబానికి చెందినదే. దీని నిర్వాహణలోనూ ఈయన కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇదీ చూడండి: