తెరాస ఎమ్మెల్యేలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. శాసనసభాపక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌రెడ్డిపై ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ చీటర్స్ కమిటీకి రేవంత్ రెడ్డి అధ్యక్షుడంటూ ఎద్దేవా చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా(white challenge telangana).. కేటీఆర్‌పై చేసిన విమర్శలే పదేపదే చేస్తున్నాడని బాలరాజు మండిపడ్డారు. కేవలం ఉనికి కాపాడుకునేందుకే విమర్శలు చేస్తున్నారని బాలరాజు దుయ్యబట్టారు. వార్తల్లో నిలిచేందుకు రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు ఇప్పుడు రాహుల్ గాంధీ మెడకు చుట్టుకున్నాయన్నారు.
"దేశవ్యాప్తంగా దళితబంధు పథకానికి రీసౌండ్ వస్తోంది. రైతుబంధుకు రీసౌండ్ వచ్చింది. దేశంలో జాతీయ పార్టీలకు ఆదరణ తగ్గింది. దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలేటువంటి లక్షణాలు, నిబద్ధత ఉన్న నాయకులు కేసీఆర్, కేటీఆర్. అటువంటి నాయకులపై విమర్శలు చేయటం వల్ల వార్తల్లో నిలుస్తామనే కుటిల ప్రయత్నం రేవంత్‌రెడ్డి చేస్తున్నాడు. ఇప్పటికైన తీరు మార్చుకోకపోతే.. పరిణామాలు వేరే ఉంటాయి."- గువ్వల బాలరాజు, అచ్చంపేట ఎమ్మెల్యే
వ్యక్తిగత ప్రతిష్ఠను దిగజార్చడం వల్ల రాజకీయ పబ్బం గడుపుకోవడానికే కేటీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులకే డ్రగ్స్ పరీక్షలు చేయాలని కిషోర్ తెలిపారు. సమస్యలపై పోరాడాలి కానీ.. వ్యక్తులపై నిరాధార మాటల దాడితో ఒరిగేదేమి ఉండని తెలిపారు. ఆయన తీరుమారకుంటే రేపటి నుంచి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.