తెలంగాణ

telangana

By

Published : Sep 12, 2020, 11:09 AM IST

ETV Bharat / city

గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్​ వ్యూహరచన

గ్రేటర్‌ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కాంగ్రెస్‌.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తమకి అనుకూలంగా మార్చుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకు అణుగుణంగానే నేతలంతా శక్తివంచన లేకుండా కృషి చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సూచించారు. నగరంలోని డివిజన్లకు పార్టీ అధ్యక్షులను నియమిస్తూ... పార్టీని బలోపేతం చేసే దిశగా వ్యహరచన చేస్తుంది.

tpcc focus on ghmc elections
tpcc focus on ghmc elections

జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌ పార్టీని గ్రేటర్​లో బలోపేతం చేసే దిశగా అగ్రనాయకత్వం ముందుకెళ్తోంది. ఇప్పటి వరకు గ్రేటర్‌పై పెద్దగా దృష్టిసారించని కాంగ్రెస్​.. డివిజన్ల వారీగా కమిటీలను నిమమించే పనిలో పడింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కావాలంటే అన్ని రకాల కమిటీలు అవసరమని భావించిన హస్తం పార్టీ.. ఆ దిశలో కార్యాచరణ మొదలు పెట్టింది. దీంతో గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల ఇంఛార్జ్​లు.. వారి పరిధిలోని డివిజన్లకు ఇంఛార్జ్​ల నియామకాలను ప్రారంభించారు. శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి, గ్రేటర్ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అంజన్​కుమార్ యాదవ్‌ల నేతృత్వంలో గ్రేటర్ నియోజకవర్గాల కార్యకర్తల, నాయకుల సమావేశం జరిగింది.

సన్నాహక సమావేశాల్లో కార్యాచరణ రూపకల్పన..

రిజర్వేషన్లు ఖరారయ్యాక... మేయర్‌ అభ్యర్ధిని ప్రకటించనున్నట్లు పేర్కొన్న టీపీసీసీ.. బూత్​స్థాయి నుంచి అన్ని రకాల కమిటీలు ఉండాలని... అవి కూడా ఈ నెల 18వ తేదీ లోపు పూర్తి చేయాలని నేతలకు, డివిజన్‌ల ఇంఛార్జ్​లకు సూచించింది. అదే విధంగా ఆయా డివిజన్లలో ఎన్నికల బరిలో నిలబడబోయే అభ్యర్థులు ఎవరో ముందుగానే నిర్ణయించుకోవాలని కూడా ఉత్తమ్‌ స్పష్టం చేశారు. గతంలో అభ్యర్థుల ఎంపికలో జరిగిన జాప్యం.. పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకోవడంలో జరిగిన ఆలస్యమే పార్టీ ఓటమికి కారణమైందని అంచనాకు వచ్చిన కాంగ్రెస్‌.. ఈ సారి అలాంటి పొరపాట్లకు తావు లేకుండా ముందుకెళ్లాలని నిర్ణయించింది. అందువల్లనే సన్నాహక సమావేశాల పేరుతో ముందుగానే మేల్కొన్న పీసీసీ.. కార్యాచరణ రూపకల్పనలో నిమగ్నమైంది.

తెరాస వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ..

తెరాస పాలన పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తిని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి కలిసికట్టుగా పని చేయాలని పీసీసీ అధ్యక్షుడు.. కాంగ్రెస్‌ కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా... నేతలు అండగా నిలబడతారని స్పష్టం చేశారు. ప్రధానంగా 2014 నుంచి ఇప్పటి వరకు తెరాస ఇచ్చిన ఎన్నికల హామీల అమలు.. జరగని విషయాలను ప్రజల్లోకి విస్త్రతంగా తీసుకెళ్లాలని నిర్ణయించింది. కాంగ్రెస్​ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూనే.. తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత ఏం జరిగింది? ఏం జరుగుతుందో ప్రజలకు వివరించడం ద్వారా మద్దతు కూడగట్టాలని ప్రణాళిక రచించింది.

ఆరు డివిజన్లకు నూతన అధ్యక్షులు వీరే..

డివిజన్‌ ఇంఛార్జ్​లతో సమావేశం ముగిసిన తరువాత గ్రేటర్ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అంజన్​కుమార్ యాదవ్, ఖైరతాబాద్ నిజయోజకవర్గ ఇంచార్జ్, ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్​ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ నిజయోజకవర్గంలోని ఆరు డివిజన్లకు నూతన అధ్యక్షులను నియమించారు. ఖైరతాబాద్ డివిజన్ అధ్యక్షుడుగా కమ్మరి వెంకటేష్, హిమాయత్ నగర్ డివిజన్ అధ్యక్షురాలుగా సీనియర్ నాయకురాలు ఇంద్రరావు, సోమాజిగూడ డివిజన్ అధ్యక్షుడు యువ నాయకులు నారికేళ నరేశ్​, జూబ్లీహిల్స్ డివిజన్ అధ్యక్షుడుగా కట్టూరి రమేశ్​, బంజారాహిల్స్ డివిజన్ అధ్యక్షుడుగా ధనరాజ్ రాఠోడ్, వెంకటేశ్వర నగర్ డివిజన్ అధ్యక్షుడుగా శ్రీనివాస్ యాదవ్‌లను నియమించారు. త్వరలోనే ఖైరతాబాద్ నిజయోజకవర్గంలోని ఆరు డివిజన్లకు పార్టీకి చెందిన అన్నిరకాల నూతన కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు దాసోజు శ్రవణ్‌ తెలిపారు. రాబోవు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు.

ఇవీ చూడండి:కాంగ్రెస్​లో సమూల‌ ప్రక్షాళన! ఆజాద్​ పదవులకు కోత

ABOUT THE AUTHOR

...view details