వరుసగా వర్షాలు కురుస్తుండటంతో పలుచోట్ల ఇళ్లలో నీళ్లు నిలుస్తున్నాయి. దీంతో పలువురు డెంగీ వంటి జ్వరాల బారిన పడుతున్నారు. ఇంకొన్నిచోట్ల మురుగు నీటి కారణంగా మలేరియా వంటి జ్వరాలతో వణుకుతున్నారు. ఒకపక్క సీజనల్(కాలానుగుణ) జ్వరాల తాకిడి పెరగగా.. మరోవైపు కొవిడ్ భయం వెన్నాడుతోంది. జలుబు, దగ్గు, జ్వరం రాగానే ఇది కరోనా కావచ్చేమోననే ఆందోళన నెలకొంటోంది. ఆదిలాబాద్ జిల్లాలో అకారణ జ్వరాలు జులై నుంచి ఆగస్టు నెలకొచ్చేసరికి 12 రెట్లు పెరగడం గమనార్హం. హైదరాబాద్‌లో స్థిరంగా కొనసాగుతుండగా.. మంచిర్యాల జిల్లాలో దాదాపు మూడింతలు అధికమయ్యాయి.
రాష్ట్రంలో డెంగీ జ్వరాలు గతేడాది ఆగస్టులో కేవలం 140 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 12 రెట్లు పెరిగాయి. మలేరియా కేసులు 2020 ఆగస్టులో 59 నమోదు కాగా.. ఈ ఏడాది ఇదే నెలలో అంతకంటే రెట్టింపు సంఖ్యలో నమోదయ్యాయి. ఈ నెలలో తొలి 2 రోజుల్లోనే 188 డెంగీ కేసులు నమోదవ్వగా.. 72 మలేరియా కేసులు నిర్ధారణ అయ్యాయి. కొన్ని జిల్లాల్లో మలేరియా, డెంగీ కేసులు స్వల్ప సంఖ్యలో నమోదైనట్లు గణాంకాల్లో చూపారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ ఆదిలాబాద్‌లో 2, హైదరాబాద్‌లో 16 మాత్రమే మలేరియా కేసులు నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. ఖమ్మంలో అయితే ఇప్పటివరకూ ఒక్క మలేరియా కేసూ నమోదు కాలేదని నివేదిక ఇవ్వడం వైద్యాధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కొన్ని జిల్లాల్లో అధికారులు ఉద్దేశపూర్వకంగానే కేసుల సంఖ్యను తక్కువచేసి చూపుతున్నారనే ఆరోపణలున్నాయి. వీటిపై ఒక జిల్లా వైద్యాధికారులను ఉన్నత స్థాయి అధికారులు హెచ్చరించినట్లుగా వైద్యవర్గాలు చెబుతున్నాయి.
ప్రైవేటులో ధరల బాదుడు
ప్రభుత్వ లెక్కల కంటే మూడు రెట్లు అదనంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో జ్వరాలతో చికిత్స పొందుతున్నారని అంచనా. హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో జ్వర పీడితుల సంఖ్య గణనీయంగా నమోదవుతోంది. ఇదే అదనుగా ప్రైవేటు ఆసుపత్రులు రోగులను దోచుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి.