AP CM Jagan-Tollywoods Bigwigs Meet సినీరంగ ప్రముఖులు ఉదయం 11 గంటలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ను కలవనున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున సహా పలువురు హీరోలు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మంత్రి పేర్ని నానితో ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. నిర్మాతలు నష్టపోకుండా టికెట్ల ధరలు పెంచాలని పరిశ్రమ ప్రముఖులు కోరనున్నారు. ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ కూడా... టికెట్ ధరలు పెంచాలని ప్రాథమికంగా సిఫార్సు చేసినట్లు తెలిసింది. పరిశ్రమ ప్రతిపాదనలు, కమిటీ సిఫార్సులపై సినీ ప్రముఖులతో సీఎం జగన్ చర్చించనున్నారు. ఎంతమేర టికెట్లు పెంచాలనే దానిపై అభిప్రాయాలు తీసుకుంటారని తెలిసింది.
రాయితీ సహా సినీ కార్మికులకు సాయంపైనా..
చిత్ర పరిశ్రమకు ప్రభుత్వ సాయంపైనా సీఎంతో సినీ ప్రముఖులు చర్చిస్తారని సమాచారం. కొవిడ్ తొలిదశలో లాక్డౌన్ కారణంగా 3నెలల పాటు థియేటర్లు మూతపడ్డాయి. ఆ తర్వాత తెరచుకున్నా 50 శాతం సీటింగ్ సహా వివిధ రకాల ఆంక్షలతో రాబడి అంతంతమాత్రమేనని యజమానులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో థియేటర్ల యజమానులకు కరెంట్ బిల్లుల రాయితీ సహా సినీ కార్మికులకు సాయంపైనా చర్చించనున్నారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు అవార్డులు ఇవ్వడం, ఇతరత్రా తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ పరిశ్రమ ప్రముఖులతో సమావేశం ఉండటం, అలాగే టికెట్ రేట్ల పిటిషన్ హైకోర్టులో విచారణకు వస్తున్నందున.. బుధవారం సీఎంతో మంత్రి పేర్ని నాని సమావేశమై చర్చించారు.
కొందరితోమే చర్చలు సరికాదు...
సినీ పరిశ్రమ సమస్యలపై కేవలం కొందరితో చర్చించడం సరికాదని... దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ భేటీతో సినిమా టికెట్ల సమస్య కొలిక్కి వస్తుందని భావిస్తున్నానని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు.