తెలంగాణ

telangana

ETV Bharat / city

నేడు చిత్తూరు జిల్లాకు చంద్రబాబు.. నిరసనకు అనుమతి నిరాకరణ

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏపీలోని చిత్తూరు జిల్లా పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. తెదేపా కార్యకర్తలు, నగరపాలక సంస్థ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులపై జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా చిత్తూరు, తిరుపతిలో చంద్రబాబు దీక్ష చేపట్టేందుకు సమాయత్తం అయ్యారు. అయితే రెండు చోట్ల పోలీసులు అనుమతి నిరాకరించడంతో..చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ పెంచుతోంది.

today-chandra-babu-will-tour-chittoor-district
నేడు చిత్తూరు జిల్లాకు చంద్రబాబు

By

Published : Mar 1, 2021, 8:57 AM IST

ఏపీ పురపాలక ఎన్నికల్లో...పోటీ చేసే తెదేపా అభ్యర్థులపై అధికార పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు. పార్టీ అభ్యర్థులకు ధైర్యం చెప్పేందుకు జిల్లా పర్యటన చేపట్టారు. విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి చిత్తూరు వెళ్తారు. ఉదయం 11 గంటలకు చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. అధికార పార్టీ తీరుకు వ్యతిరేకంగా...దాదాపు 5 వేల మందితో దీక్ష చేపట్టాలని కార్యచరణ సిద్ధం చేశారు. చిత్తూరులో నిరసన దీక్ష ముగిసిన అనంతరం.. తిరుపతిలో పర్యటిస్తారు. అక్కడ మున్సిపల్ అధికారుల తీరుతో దుకాణం కోల్పోయిన తెదేపా కార్పొరేటర్‌ అభ్యర్థి భర్త శ్రీనివాస్‌ను పరామర్శిస్తారు. అయితే రెండు చోట్ల పోలీసులు అనుమతి నిరాకరించడం ఇప్పుడు పర్యటనపై ఉత్కంఠతను పెంచుతోంది.

దీక్షకు అనుమతి లేదంటూ పోలీసుల ప్రకటన

కొవిడ్ నిబంధనలు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున... శాంతిభద్రతల దృష్ట్యా నిరసన దీక్షకు అనుమతి ఇవ్వలేమని..చిత్తూరు డీఎస్పీ ఓ ప్రకటనలో వెల్లడించారు. తిరుపతిలో శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికుల రద్దీ, బస్టాండ్ సమీప ప్రాంతం కావడం, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇవ్వలేమని తిరుపతి తూర్పు డీఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఈ తరుణంలో చంద్రబాబును పోలీసులు రేణిగుంట విమానాశ్రయంలోనే నిలువరించేందుకు ప్రయత్నిస్తారని తెలుగుదేశం నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బాధితులకు అండగా..... నిరసన దీక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ చేపడతామని తెలుగుదేశం నేతలు స్పష్టంచేస్తున్నారు. ఈ తరుణంలో సోమవారం చిత్తూరు జిల్లాలో ఏం జరగబోతుందోనని ఉత్కంఠ రేపుతోంది.

నేడు చిత్తూరు జిల్లాకు చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details