'బ్లాస్ట్ 1.ఓ'... కరోనా పోరులో తిరుపతి ఐఐటీ వినూత్న ఆవిష్కరణ కొవిడ్ -19పై పోరాటంలో ప్రపంచ వ్యాప్తంగా అవలంభిస్తున్న చర్యలన్నీ రక్షణాత్మక పద్ధతులే. మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడడం, భౌతిక దూరం పాటించటం.. ఇవన్నీ వైరస్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకునే పద్ధతులు. కానీ అంతకు మించి అన్నట్లు...తిరుపతి ఐఐటీ ముందడుగు వేసింది. సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్ల కృషితో కరోనాపై నేరుగా పోరాడేందుకు ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది. కంటికి కనిపించని వైరస్‌ను పట్టి.. అంతమొందిచడమే లక్ష్యంగా థర్మల్ స్టెరిలైజర్ రూపొందించింది. 'బ్లాస్ట్ 1.ఓ'గా నామకరణం చేసింది. కరోనా పోరులో 'బ్లాస్ట్ 1.ఓ' గేమ్ ఛేంజర్‌గా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
'బ్లాస్ట్ 1.ఓ'... (బ్లోడ్ ఎయిడైడ్ ఎయిర్ స్టెరిలైజేషన్ బై టెంపరేచర్) తిరుపతి ఐఐటీ కెమికల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్లోని నిపుణుల ఆలోచనలకు ప్రతిరూపం. కొవిడ్‌పై పోరులో భాగంగా. తిరుపతి ఐఐటీ శాస్త్రవేత్తలు విభిన్న ఆవిష్కరణలకు రూపకల్పన చేశారు. కొవిడ్-19 సర్వైవల్ గేమ్, మూడ్ ఆఫ్ ఇండియా వెబ్ పోర్టల్ లాంటి వినూత్న ఆవిష్కరణలకు జీవం పోశారు ఐఐటీ నిపుణులు. తాజాగా కెమికల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ తరపున 'బ్లాస్ట్ 1.ఓ'ను రూపొందించారు. మన చుట్టూ ఉన్న గాలిలో వైరస్, బ్యాక్టీరియా వంటి జీవులు నీటితుంపర్లలో ఉండే అవకాశాలు ఎక్కువ. ఈ సూక్ష్మజీవులు రోగుల నుంచి గాలిలో చేరతాయి.
కరోనా వైరస్ కూడా రోగుల నుంచి తుంపర్ల ద్వారా గాలిలో చేరుతుంది. ఈ సూక్ష్మజీవులు గాలిలో కొన్ని గంటల వరకు సజీవంగా ఉంటాయి. ఇలా గాలిలో ఉండే సూక్ష్మజీవులను అంతతేలికగా గుర్తించలేం. ఈ విషయాల ఆధారంగా తిరుపతి ఐఐటీ కెమికల్ ఇంజినీరింగ్ నిపుణులు 'బ్లాస్ట్ 1.ఓ' తీర్చిదిద్దారు. తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ సూచనలు మేరకు... ఐసర్ శాస్త్రవేత్తలు డా.వసుధ, డా.హర్షిణి సహకారంతో.. ఐఐటీ తిరుపతి కెమికల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డా.సునీల్ కుమార్ ఈ యంత్రాన్ని రూపొందించారు.
- బ్లాస్ట్ 1.ఓ పనిచేసే విధానం
మన చుట్టు పక్కల వాతావరణంలోని గాలిని లోపలికి పంపేలా బ్లాస్ట్‌లో ఓ ఇన్‌లెట్‌ను ఏర్పాటుచేశారు. బ్లోయర్ సాయంతో వ్యాక్యూమ్ ఏర్పడేలా చేస్తారు. ఇది ఒక మీటరు దూరంలో ఉన్న గాలిని పీల్చుకుంటుంది. బ్లోయర్ ద్వారా పైప్లైన్లలో లూప్ అవుతూ గాలి రీసైకిల్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ పైప్‌కి హీటర్‌ను ఏర్పాటుచేశారు. హీటర్ ద్వారా 54 డిగ్రీల ఉష్ణోగ్రత ఆ పైప్లైన్లలో ఉత్పత్తి అయ్యే విధంగా టెంపరేచర్ కంట్రోలర్ అమర్చారు. ఫలితంగా బయట నుంచి వచ్చే గాలి....పూర్తిగా వేడెక్కి అందులో ఉన్న వైరస్ పూర్తిగా చనిపోయే విధంగా ప్రోటోటైప్‌ను తయారుచేశారు. రీసైకిల్ చేయటం ద్వారా అందులో ఉన్న గాలి వేడెక్కటం ద్వారా వైరస్ బయటకు వచ్చేందుకు ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేశారు. తిరిగి బయటకు వచ్చే గాలి కోసం ఓ అవుట్‌లెట్‌ను ఏర్పాటు చేశారు. వచ్చే గాలి పూర్తిగా శుద్ధి అయ్యే విధంగా ప్రణాళికలు చేశారు.
బయటకి వచ్చిన గాలి..పూర్తిగా శుద్ధి అయ్యిందన్న అంశాలను ధృవీకరించుకునేందుకు శాస్త్రవేత్తలు ఐసర్ సాయం తీసుకున్నారు. బ్లాస్ట్ అవుట్లెట్ నుంచి బయటకు వచ్చిన గాలిని ఐసర్ శాస్త్రవేత్తలు పరీక్షించారు. మొత్తం ఐదుసార్లు ఈ ప్రయోగాన్ని ఐసర్ శాస్త్రవేత్తలు జరపగా... ప్రతిసారీ సానుకూల ఫలితాలు వచ్చాయి. సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద తీసుకున్న గాలిని, బ్లాస్ట్ అవుట్ లెట్ నుంచి వచ్చిన గాలిని సరిపోల్చి చూడగా...ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్లాస్ట్ పరికరం ద్వారా వస్తున్న గాలి 99 శాతం సంతృప్తికర ఫలితాలనే ఇస్తోందని ఐసర్ శాస్త్రవేత్తలు, నిపుణులు ధృవీకరిస్తున్నారు.
- చరిత్రలో నిలిచిపోయే ఆవిష్కరణ
'బ్లాస్ట్ 1.ఓ' రూపకల్పనపై మార్చి నుంచి తిరుపతి ఐఐటీ పరిశోధనలు చేస్తోంది. ఓ ప్రోటోటైప్‌ను పూర్తి చేశారు. కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందికి వైరస్ సోకకుండా ఈ పరికరం పరిరక్షిస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. రోగికి మీటరు దూరంలో ఈ యంత్రాన్ని ఉంచటం వల్ల అతని చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న గాలిని శుద్ధిచేస్తుందని అంటున్నారు. ఈ ఆవిష్కరణలకు ప్రొవిజనల్ పేటేంట్ దరఖాస్తు చేశామని శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనాపై నేరుగా పోరాడిన తొలి ఆవిష్కరణగా 'బ్లాస్ట్ 1.ఓ' చరిత్రలో నిలిచిపోనుందని ఐఐటీ, ఐసర్ నిపుణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి :కూల్‌డ్రింక్‌లో చీమల మందు కలుపుకొని తాగిన చిన్నారులు..బాలుడు మృతి