తిరుపతి స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నగరంలో రూ.684 కోట్లతో నిర్మిస్తున్న గరుడ వారధి పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. తితిదేకు చెందిన శ్రీనివాసం భక్తుల వసతి గృహం సముదాయం వద్ద గరుడ వారధి డౌన్‌ర్యాంప్ పై ఏర్పాటు చేసిన సిమెంటు సెగ్మెంట్లు కిందికి జారిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద శబ్దాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం రెండు స్తంభాల మధ్య ఈ సెగ్మెంట్లను ఏర్పాటు చేసిన గుత్తేదారు సంస్థ వాటిని స్తంభంపై నిలబెట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సమాచారం. దీంతో సెగ్మెంట్లన్నీ కిందకు జారిపోయాయి.
గరుడ వారధి పనుల్లో అపశృతి.. కూలిన ఫ్లైఓవర్
తిరుపతి స్మార్ట్‌సిటీలో భాగంగా నిర్మిస్తున్న గరుడ వారధి కూలిపోయింది. తితిదే శ్రీనివాసం భక్తుల సముదాయం సమీపంలో ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కార్మికులు తృటిలో తప్పించుకున్నారు.
జారిపోయిన సెగ్మెంట్లు శ్రీనివాసం వసతి గృహ ప్రహరీపై పడటంతో పెద్ద శబ్దం వచ్చింది. ఆ సమయంలో కార్మికులు ఎవరూ విధుల్లో లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం గానీ, గాయాలు గానీ కాలేదు. సంఘటన తెలుసుకున్న వెంటనే తిరుపతి నగరపాలక కమిషనర్ గిరీష, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి అక్కడికి చేరుకుని ఘటనకు గల కారణాలను గుత్తేదారు సంస్థ ఆఫ్కాన్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి విచారణ జరపనున్నట్లు వారు తెలిపారు. గరుడ వారధి సెగ్మెంట్ల కూలడంపై తెదేపా, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు అక్కడికి చేరుకుని అధికారుల నిర్లక్ష్యం వలనే ఇలా జరిగిందని ఆరోపించారు. గరుడ వారధి నిర్మాణం పనులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండు చేశారు.
ఇదీచదవండి:రాష్ట్ర అధికారులకు పోలీస్ పతకాలను ప్రకటించిన కేంద్రం