ఏడుకొండలవాడి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చకులు వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. స్వామివారి సేనాధిపతులైన విశ్వక్సేనుల శ్రీవారి సన్నిధి నుంచి విమాన ప్రదక్షిణగా రంగనాయకుల మండపానికి చేరుకున్నారు. వైదిక కార్యక్రమాల అనంతరం యాగశాలలో అంకురార్పణ జరిగింది. ఉత్సవాల విజయానికి స్వామివారి ఆశీస్సులు పొందుతూ నవ ధాన్యాలను మొలకెత్తించారు.
ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలుకుతూ సాయంత్రం 6 గంటల 3 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్య మీన లగ్నంలో.. ధ్వజారోహణం జరుగుతుంది. దీనికోసం విష్ణు దర్బతో తయారు చేసిన 7 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు ఉన్న చాపను, 211 అడుగుల పొడవు తాడును సిద్ధం చేశారు. రాత్రి ఎనిమిదిన్నర గంటలకు పెద్దశేషవాహనసేతో వాహన సేవలు ప్రారంభమవుతాయి. 9 రోజుల పాటు స్వామివారు వివిధ వాహన సేవలపై దర్శనమిస్తారు. కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఆలయం లోపల కల్యాణ మండపంలో వాహన సేవలను కొలువు తీర్చి వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.